వృద్ధి చెందుతున్నభారత-వియత్నాం సంబంధాలు

భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం వియత్నాం వెళ్లారు. వియత్నాంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకునే లక్ష్యంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వియత్నాంలో పర్యటించారు. భారత-వియత్నాం భాగస్వామ్యం  సుదీర్ఘకాలంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని స్థిరంగా  కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వియత్నాం ఉన్నత రాజకీయనాయకులతో భారత ఉపరాష్ట్రపతి మంతనాలు సాగించారు. అంతకాదు అక్కడున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధ గాఢతను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వియత్నాంకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ డాంగ్ థి నాక్ తిన్‌తో కూడా సమావేశమయ్యారు. అలాగే వియత్నాం ప్రధాని యుయెన్ గ్జాన్ ఫుక్‌తో, జాతీయ అసెంబ్లీ ఛైర్‌విమెన్ నుయెన్ తి కిమ్ గాన్‌లతో కూడా చర్చలు జరిపారు. వియత్నాంలోని హ నామ్ ప్రావిన్స్‌లోని తామ్ ఛుక్ పగోడాలో జరిగిన పదహారవ యునైటెడ్ నేషన్స్ డే ఆఫ్ ‘వెసాక్’ ఉత్సవాలను ఉద్దేశించి భారత ఉపరాష్ట్రపతి కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమం ‘బుద్ధిస్ట్ అప్రోచ్ టు గ్లోబల్ లీడర్‌షిప్ అండ్ షేర్డ్ రెస్పాన్స్‌ బిలిటీస్ ఫర్ సస్టైనబుల్ సొసైటీస్’ అన్న అంశంపై జరిగింది.        

భారత, వియత్నాంల మధ్య అత్యున్నత స్థాయి నాయకత్వాల పర్యటనలు  క్రమం తప్పకుండా చోటుచేసుకుంటూ వచ్చాయి. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా పెరగడానికి దోహదపడడమే కాదు భారత ప్రధాని 2016లో వియత్నాం సందర్శించినపుడు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి  తెరలేపింది కూడా. 2018, మార్చిలో చోటుచేసుకున్న  ఉపరాష్ట్రపతి వియత్నాం పర్యటనలో అత్యున్నతస్థాయిలో ఇచ్చిపుచ్చుకోవడాలు చోటుచుకున్నాయి. ఆ పరిణామాల్లో వియత్నాం ప్రధాని, ప్రెసిడెంట్లు ఇరువురూ వరుసగా 2018 జనవరి, 2018 మార్చిలలో భారత్‌లో పర్యటించడం కూడా ఉంది. ఇరుదేశాల మధ్య పరస్పర  పర్యటనలు, ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల వివిధ రంగాలలో పటిష్టమైన సహకారం వీటిమధ్య వృద్ధిచెందింది. రక్షణ, భద్రతా సంబంధాలతో పాటు, నూతన ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాలు, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత లోతుగా బలపడ్డాయి. రెండు దేశాలు కూడా ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలు, సంపద వృద్ధిచేయడం వంటి  ప్రధాన లక్ష్యంతో ముందుకు వెడుతున్నాయి.

విదేశాల్లో నివాసిస్తున్న భారతీయులకు సన్నిహితం కావడం కూడా భారత విదేశాంగ విధానంలో ముఖ్యమైన అంశం. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వియత్నాంలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇన్ హనోయ్’లను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులకు దగ్గర కావడానికి భారత ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

ద్వైపాక్షిక సంబంధాలు, బహుపాక్షిక సహకారాలను పెంపొందించుకునేందుకై వియత్నాం వైస్ ప్రెసిడెంట్ డాంగ్ థి నాక్ థిన్‌తో విస్తృతస్థాయిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  సంభాషణలు జరిపారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతాన్ని ప్రశాంతమైన, సుసంపన్నమైన ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన ప్రాధాన్యాన్ని భారత ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. ఇది ఆ ప్రాంత దేశాల సార్వభామాధికారంతో పాటు అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ జరగాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర విశ్వాసం, అవగాహన, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరుదేశాల అభిప్రాయాల సమ్మేళనల భూమికగా సాగాలనేది  ఈ దేశాల ప్రధాన ఉద్దేశం.

భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న దేశం వియత్నాం. ఈ పాలసీ లోంచి చూస్తే భారత్‌కు వియత్నాం మూల స్తంభంలాంటిది. అంతేకాదు ఆసియాన్‌ (ఎఎస్ఇఎఎన్) లో సంభాషణల పరంగా  కూడా వియత్నాంది కీలక గళం. అందుకే ఇరు దేశాలు కూడా సౌత్ చైనా సీ విషయంలో నిబంధనావళి కనుగుణంగా సంబంధిత దేశాలు ఏకతాటిపై సాగాలని కోరుకున్నాయి. ఇండో-ఫసిఫిక్ ప్రాంతం జీవ-భౌగోళిక ప్రాంతం. ఇందులో హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య ఫసిఫిక్ సముద్రంతో పాటు సౌత్ చైనా సీ కూడా ఉంది. వివాదాస్పదమైన సౌత్ చైనా సీ ప్రాంతంలో అమెరికా ‘ఫీడ్రమ్ నావిగేషన్’ విన్యాసాలు వరుసగా చేయడంతో బీజింగ్ నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికా ఈ చర్య చైనా సార్వభౌమాధికారాన్ని అతిక్రమిస్తోందని బీజింగ్ అభిప్రాయపడింది. అదే సమయంలో చైనా ఈ సముద్ర ప్రాంతంలో చాలా మేర తమ ప్రాంతంలో ఉందని అంటోంది.  బ్రూనే, మలేసియా, ఫిలిప్పైన్స్, వియత్నాం, తైవాన్లు కూడా ఈ ప్రాంతం తమ ‘ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్స్’ (ఇఇజడ్ఎస్) పరిధిలోకి వస్తాయని అంటున్నాయి. దీంతో చైనా సీ చాలా కీలక అంశంగా మారింది.

ద్వైపాక్షిక స్థాయిలో చూస్తే, భారత-వియత్నాం సంబంధాలు ఎన్నో రంగాలలో బాగా పటిష్టమయ్యాయి. అంతేకాదు ఈ దేశాల మధ్య సంబంధాలు వివిధ ముఖాలుగా విస్తరిస్తున్నాయి. రక్షణ,భద్రత, అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం,  అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, చమురు, సహజవాయువులు, పునరుత్పాదక శక్తి, మౌలికసదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, కొత్త ఆవిష్కరణలతో కూడిన రంగాలకు రెండు దేశాల సహకారం బలీయంగా విస్తరించింది.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 14 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. మూడు సంవత్సరాల క్రితం 7.8 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్న వీటి ద్వైపాక్షిక వాణిజ్య విలువ రెట్టింపు అవడం చూస్తాం. న్యూఢిల్లీ, హనోయ్‌లు 2020 సంవత్సరం నాటికి తమ ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గతంలో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య పెరుగుదల ధోరణి గమనించినట్లయితే ఈ లక్ష్యాన్ని భారత్, వియత్నాలు సులభంగా సాధించేలా కనిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా అనుసంధానత అంశం కూడా రెండు దేశాల మధ్య ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకూ న్యూఢిల్లీ, హనోయ్‌ల మధ్య డైరక్టు విమాన అనుసంధానం లేదు. గతంలో ఇది వాణిజ్యపరంగా అసాధ్యమని భావించారు. మొత్తానికి ఇరు దేశాల రాజధానుల మధ్య నేరుగా విమాన అనుసంధానత సాధ్యం అయ్యేట్టు ప్రస్తుతం కనిపిస్తోంది. ఇండియన్ కేరియర్ రెండు దేశాల రాజధానుల మధ్య విమాన సర్వీసులను 2019 లో   ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇది కార్యరూపం దాలిస్తే, మరో పెద్ద అవాంతరాన్ని దాటి రెండు దేశాలూ మరింత సన్నిహితమవుతాయి. దీనివల్ల ఇరుదేశాల వాణిజ్యం, పర్యాటకం రంగాలు మరింత వృద్ధి సాధిస్తాయి.

రచన: ప్రొ. రాజారామ్ పాండా, లోక్ సభ రీసెర్చ్ ఫెలో, పార్లమెంట్ ఆఫ్ ఇండియా