టర్కీ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్న భారత్

భారత్, టర్కీలు తమ మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పురోగతి సాధిస్తున్నాయి. ఇటీవల ఉన్నతాధికారుల స్థాయిలో జరిగిన రెండు వరుస సమావేశాలు సానుకూల ఫలితాలనిచ్చాయి. టర్కీ తనకు సంప్రదాయంగా పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలకు, కొత్తగా భారత్‌తో ఏర్పడుతున్న సంబంధాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయాలని అనుకుంటోంది. ఈ క్రమంలో అంకారా తన అధ్యక్ష సలహాదారు డా. ఇబ్రహీం కలిన్‌ను ఢిల్లీకి పంపింది. ఆయన టెర్రరిజాన్ని, రాడికలైజేషన్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయాన్ని కోరారు. అంతేకాక ఆర్థిక పరమైన భాగస్వామ్యంపై కూడా చర్చించారు.

భారత్ తాను సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సరిహద్దు ఉగ్రవాదం విషయంలో టర్కీ సహకారాన్ని కోరింది. ఇబ్రహీం కలిన్ భారత రక్షణ సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్‌ను కలిసినపుడు ఇరువురి మధ్య ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల అంశం ప్రస్తావనకు వచ్చింది.

ఇరు పక్షాలు తమ భేటీలో భాగంగా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలకు కూడా పెద్ద పీట వేశాయి. ఇందులో భాగంగా దక్షిణాసియా, పశ్చిమాసియా అంశాలపై లోతుగా చర్చ జరిగింది. ఉగ్రవాదాన్ని రూపంలో ఉన్న ఎదుర్కోవాలనీ, దాన్ని తుదకంటా మట్టుబెట్టాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న వారిని గుర్తించి తగిన విధంగా శిక్షించాలని నిర్ణయానికి వచ్చాయి. ఇరుపక్షాల అధికారులు తదనంతరం నాగరికత, సాంస్కృతిక సంబంధాలపై చర్చించారు.

కలిన్ పర్యటనలో ముఖ్యమైన విషయం సీనియర్ ఇస్లామిక్ స్కాలర్లు, మేధావులతో జరిపిన సమావేశం. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో అంకారా డీ రాడికలైజేషన్‌కు పూర్తి స్థాయి మద్దతు పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశం ద్వారా భారత దేశంలోని సంస్కృతి, బహు జాతి వ్యవస్థ, ఇస్లామిక్ సంప్రదాయాలను అర్థం చేయించేందుకు ఉపయోగపడింది.

కలిన్ భారత పర్యటన అనంతరం కొద్ది రోజులకే టర్కీ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సేదత్ ఒనల్ భారత్‌కు మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చారు. ఆయన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (తూర్పు) గీతేష్ ఎ శర్మతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కూలంకశంగా చర్చలు చేశారు. వాణిజ్య సంబంధాలు, పెట్టుబడుల వ్యవహారాలపై ఆయన ఆరా తీశారు. ఇరు పక్షాలు తమ ప్రాంతాల్లోని పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు. బహుపాక్షిక అంశాలపై తమ ముచ్చటించుకున్నారు.

పాకిస్తాన్ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు భారత్‌కు అంకారా మద్దతు ఎంతో అవసరం. ఎందుకంటే ఆ దేశం ఇస్లామాబాద్‌తో ఎంతో కాలంగా సంబంధాలతో ఉంది. అయితే టర్కిష్ ప్రెసిడెంట్ రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ దక్షిణాసియా విషయంలో టర్కిష్ పాత్రను నెమ్మదిగా కీలకం చేసే యోచనతో ఉన్నారు.

2017లో ఎర్డోగాన్ భారత్‌కు వచ్చినపుడు ఆయన భారత ప్రధానితో వ్యక్తిగతమైన సంబంధాలు నెరిపేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరిగిన సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ కొద్ది గంటల్లోనే సహాయం చేసేందుకు ముందుకు రావడం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది.

భారత దేశం, పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తన విధానంలో భాగంగా పశ్చిమాసియా-సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీలతో మూడు కోణాల్లో సంబంధాలు నెరపాలని భావిస్తోంది.

ఇరు దేశాలు టూరిజం, స్మార్ట్ సిటీలు, నిర్మాణ రంగం, మౌలిక వసతులు, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాయి. టర్కిష్ ప్రెసిడెంట్ 2017లో భారత్‌కు వచ్చి వెళ్లాక ద్వైపాక్షిక వాణిజ్యం అనూహ్యంగా పెరిగి ప్రస్తుతం 8.6 బిలియన్ పౌండ్లకు చేరుకుంది. 2020 నాటికి ఇది 10 బిలియన్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. టర్కిష్ ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమమవుతోంది.

గత దశాబ్ధన్నర కాలంగా భారత్-టర్కీల నడుమ వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. భారత్ నుంచి టర్కీకి ఎగుమతి అయ్యే ప్రధాన వస్తువులు నూనెలు, ఇంధనాలు, మ్యాన్ మేడ్ ఫిలమెంట్లు, ఫైబర్స్, ఆటోమోటివ్ విడి భాగాలు, యాక్సెసరీలు, సేంద్రయ రసాయనాలు తదితరాలు. టర్కీ నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో గసగసాలు, మెషినరీ, వైద్య పరికరాలు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, ఇనార్గానిక్ రసాయనాలు, ముత్యాలు, రంగు రాళ్లు, మెటల్స్ (ఇమిటేషన్ జ్యువెలరీ), చలువ రాయి తదితరాలు ఉన్నాయి.

భారత్, టర్కీలకు నడుమ చారిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. ఒట్టోమాన్ సుల్తానులతో భారత దేశానికి దౌత్యపరమైన సంబంధాలు నెలకొన్నాయి. రెండు ఉప ఖండాల నడుమ దాదాపుగా 1481-82ల నుంచే ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. టర్కీలోని మౌలానా జలాలుద్దీన్ రూమీ సూఫీ తత్వం భారత దేశంపై తీవ్రమైన ప్రభావం వేసింది. దాంతో దేశీయమైన సూఫీ, భక్తి ఉద్యమం కూడా బయలుదేరింది. ఇటీవలి కాలంలోని సంఘటన చెప్పుకోవాలంటే డాక్టర్ ఎం.ఎ.అన్సారీ 1912లోని బాల్కన్ యుద్ధాలు, ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) సమయంలో భారత దేశం నుంచి మెడికల్ మిషన్‌పై బయలుదేరి ఎన్నో సేవలు అందించారు. 1920లలోని టర్కీ స్వాతంత్ర్యోద్యమం, టర్కిష్ రిపబ్లిక్ ఏర్పాటు విషయంలో భారత దేశం మద్దతుగా నిలిచింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో టర్కీకి జరిగిన అన్యాయాన్ని మహాత్మా గాంధీ స్వయంగా నిరసించారు.

రచన : దీపాంజన్ రాయ్ ఛౌదరి, డిప్లొమాటిక్ కరస్పాండెంట్