ఉగ్రదాడుల నేపథ్యంలో బయటపడ్డ పాకిస్తాన్

ఎన్నో నెలల సుదీర్ఘచర్చల అనంతరం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్) ఎట్టకేలకు పాకిస్తాన్‌ను మరో ఆర్థిక సమస్య నుంచి సురక్షితంగా బయటపడేసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పాకిస్తాన్ ప్రధాని సలహాదారు డా. హఫీజ్ షేక్ మాట్లాడుతూ పాకిస్తాన్‌కు, ద్రవ్యనిధి సభ్యులకు మధ్య  ఆఖరి పర్యాయం జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆరు బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ పూర్తిగా అప్పుల ఊబిలో మునిగి ఉంది. తమ దేశ ఆర్థిక అవసరాలకు కావాలసిన  18 బియన్ అమెరికన్ డాలర్ల లోటును పాక్ ఎదుర్కొంటోంది. అలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపించడానికి పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ సహాయం అత్యవసరం.

ఎనిమిది నెలల క్రితం పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఎఫ్ కఠిన నిబంధనలను విధించిన పక్షంలో దాని ఆర్థిక సహాయం అవసరం లేదని అన్నారు. మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియా, యుఎఇల మీద ఇమ్రాన్ ఖాన్ ఎక్కువగా ఆధారపడ్డారు. కానీ ప్యాకేజిపై ఐఎంఎఫ్ తాజా పరిమితులను జోడించింది. ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్ కోరిన మూడొంతులు అన్ని షరతులకు అంగీకరించక తప్పలేదు. ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ద్రవ్యపరంగా సర్దుబాట్లు చేయడం, ఆర్థిక సమీకరణాలు, రెవెన్యూ పెంపుదల కోసం పన్నుల రేట్లను పెంచడం, విస్తృత స్థాయిలో నిర్మాణాత్మకమైన సంస్కరణలు, సబ్సిడీలకు కోత, అలాగే మార్కెట్ నిర్థారిత మారక రేట్లు వంటివి ఎన్నో ఉన్నాయి.

ఇమ్రాన్ ఖాన్ పన్నులు పెంచనని గతంలో చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అలాగే విద్యుత్, గ్యాసు ఛార్జీలను కూడా పెంచనన్నారు. వాటిని పెంచిన పక్షంలో ప్రజల కష్టాలు మరింత ఎక్కువవుతాయి.  ఆదాయంపై కోత, ద్రవ్యోల్బణం పెరగడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే పాకిస్తాన్‌లో అత్యవసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్‌పై ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్) ఒత్తిడి కూడా బాగా ఉంది. అవసరమైతే పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టే రిస్కు   కూడా ఉంది.

పాకిస్తాన్ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్‌ను, పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్‌ తారిఖ్ బాజ్వాలను ప్రధాని ఇమ్రాన్ పదవులను తొలగించారు. వారి స్థానంలో ఐఎంఎఫ్ మాజీ అధికారులను తీసుకున్నారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు ఎలా మారనున్నాయో స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ జిడిపి పెరుగుదల 3.9 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 9.4 శాతానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం తొమ్మిది బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయాయి.  

అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు ఐఎంఎఫ్ నిబంధనలకు తలొగ్గడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఈ వాతావరణంలో ఆర్థిక క్రమశిక్షణతో పాకిస్తాన్ వ్యవహరిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి ఉగ్రవాదాన్ని బలంగా అణిచివేయడం ద్వారా శాంతియుత పరిస్థితులను నెలకొల్పడం, అభివృద్ధి కార్యకలాపాల కోసం నిధులను విడుదల చేయడం. రెండవ ముఖ్య అంశం పాకిస్తాన్ పౌర ప్రభుత్వానికే రాజకీయ నిర్ణయాలను వదిలిపెట్టాలి. దేశ భద్రత పరంగా మాత్రమే పాకిస్తాన్ సైన్యం పరిమితం కావాలి.

పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తుండడం అంతర్జాతీయ కమ్యూనిటీని తీవ్రంగా ఆందోళన పరుస్తున్న అంశం. దీనివల్ల ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసి అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇతర దేశాలు, సంస్థల నుంచి పాకిస్తాన్‌కు కావలసిన రుణాలు అందడం లేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. ఇటీవ బెలూచిస్తాన్ లోని గ్వాదర్ సిటీలో ఉన్న ఒకే ఒక ఐదు నక్షత్రాల హోటల్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) ప్రకటించింది. దీనికి ముందు బెలూచిస్తాన్‌లోని హర్నాయ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు నుంచి దిగుతున్న ప్రయాణీకులపై కాల్పులు జరపడంతో వారు మరణించారు. వారిలో పాకిస్తాన్ నావికాదళానికి చెందిన పురుషులు కూడా ఉన్నారు. బెలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. బిఎల్ఎ ఆధ్వర్యంలో అది మరింత తీవ్రతరం అయింది. పాకిస్తాన్‌లోనే అతి పెద్ద ప్రావిన్సు అయిండి, సహజవనరుల నిధిగా కూడా అయిన బెలూచిస్తాన్‌ నేడు ఆ దేశంలోనే కడుపేద ప్రాంతంగా ఉండడంపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

బెలూచిస్తాన్ ప్రజలు ‘చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’ (సిపిఇసి)ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజక్టులో చాలా భాగం బెలూచిస్తాన్ గుండానే వెడుతుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అది ఆ ప్రాంతానికి  ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చదు. ఈ ప్రాజక్టుపై చైనావాళ్లు పనిచేయడం పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికే హోటల్‌పై ఉగ్రదాడికి పూనుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన చైనా అధికారులు చాలామంది తమ బిజినెస్ పర్యటనల్లో ఎక్కువగా ఇదే హోటల్‌లో బసచేస్తుంటారు. ఐఎంఎఫ్ ఆపన్నహస్తం  పాకిస్తాన్ సురక్షితంగా ముందుకు సాగడానికి వీలు కల్పించే, తాత్కాలికంగా ఎంతో సాంత్వన నిచ్చే అంశం. పాకిస్తాన్ నాయకత్వం కూడా తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితుల విషయంలో సమగ్ర దృక్కోణంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

రచన: అశోక్ హాండూ, రాజకీయ వ్యాఖ్యాత