పోంపే-లవరోవ్ సంభాషణలు:  వైషమ్యాలు సరళం చేసే దిశగా ఒక ప్రయత్నం

అమెరికా విదేశాంగమంత్రి మైక్ పోంపే రష్యాలో పర్యటించారు. రష్యా విదేశాంగమంత్రి, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో సంభాషణలు జరిపారు. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం యొక్క సరికొత్త వ్యూహాన్ని వెల్లడిస్తోంది. రష్యాతో ఉన్న వైషమ్యాలను సరళం చేయడానికి ట్రంప్ యంత్రాంగం  నూతన వ్యూహానికి తెరలేపిందన్న విషయం ఈ పర్యటన స్పష్టం చేస్తోంది.

 ఇటీవల సంవత్సరాలలో అమెరికా, రష్యాల మధ్య చిన్నపాటి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ విషయాన్ని అంతర్జాతీయ కమ్యూనిటీ గమనించింది. అమెరికా  విదేశాంగ విధాన విశ్లేషకులు అమెరికా, రష్యాల మధ్య క్లిష్టతరమైన సంబంధాలను చిన్నపాటి ప్రచ్ఛన్న యుద్ధంగా అభివర్ణించడానికి ఇష్టపడటం లేదు. కారణం రష్యాకు ఆ క్రెడిట్‌ను ఇవ్వడానికి వాళ్లు సుముఖంగా లేరు.  మాజీ సోవియట్ యూనియన్‌లో రష్యా అతి పెద్దది కావడం కూడా ఒక కారణం.

ప్రచ్ఛన యుద్ధ సమయంలో అమెరికాలోని విద్యావేత్తలు ఇరుదేశాల మధ్య  అణ్వాయుధ సమానత్వాన్ని గుర్తించారు. అమెరికాలో తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా రష్యాకు సమాన హోదా ఇవ్వడం పట్ల సుముఖంగా లేవు.  బైపోలార్ అధికార నిర్మాణం అమెరికాకు అనుకూలంగా ఉండేది. ఆమెరికా ఆర్థిక ప్రగతి, సాంకేతిక పరిజ్ఘాన ఆధిక్యతలే దీనికి ప్రధాన కారణాలు.

రష్యా తిరిగి బలం పుంజుకుని ఎదుటకు వచ్చిందన్న వాస్తవాన్ని  ఈరోజుకు కూడా అమెరికా గుర్తించినట్టు కనపడదు. ప్రపంచంలో ఆధిక్య దేశంగా రష్యా ఇంకా తన ఉనికిని తిరిగి పొందాల్సి ఉంది. అయితే ఆ దేశ  అణు, క్షిఫణి సామర్థ్యాలు అమెరికా భౌతిక ఉనికికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

గతంలో సూపర్ పవర్‌గా ఉన్న రష్యాకు, ఇప్పుడు సూపర్ పవర్‌గా ఉన్న అమెరికాకు మధ్య చిన్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉందన్న అవగాహన  అంతర్జాతీయ కమ్యూనిటీకి ఉంది. ఇరాన్ అణు ఒప్పందానికి రష్యా మద్దతు, అలాగే సిరియా ప్రభుత్వానికి మద్దతును ప్రకటించడం, ఇటీవల వెనుజులాలోని మదురొ ప్రభుత్వం  అమెరికాకు క్లిష్ట పరిస్థితులను సృష్టించాయి. ఇవి ట్రంప్ యంత్రాంగానికి పాలనా పరమైన ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. కొత్త మార్పులకు కారణమవుతోంది.

గతంలో దక్షిణ ఒస్సేషియా, జార్జియా, తూర్పు ఉక్రైయిన్లలో రష్యా తన సైనిక బలగాలతో బల ప్రదర్శన చేసినపుడు, క్రిమియాపై దాడికి పాల్పడినంత పని చేసినపుడు సైతం వాషింగ్టన్ కేవలం ప్రేక్షకపాత్ర వహించింది. అమెరికా  కొన్ని ఆంక్షలను విధించినప్పడికీ రష్యా చర్యలను అడ్డుకోవడంలో అవి పూర్తిగా విఫలమ్యాయి. ఏమీ చేయలేకపోయాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మల్లే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా-రష్యాల మధ్య సంబంధాలను సరైన దారిలో పెట్టాలనుకున్నారు. కానీ దేశీయంగా ఉన్న రాజకీయాల వల్ల వ్లాదిమిర్ పుతిన్ పట్ల విధానపరంగా ట్రంప్ పరిమితులతో వ్యవహరించాల్సి వస్తోంది. వ్లాదిమిర్ పుతిన్‌ని ట్రంప్ పలుమార్లు ఎంతో సమర్థవంతుడైన నాయకుడుగా ప్రశంసించిన విషయం మర్చిపోలేము. తన పాప్యులారిటీ పెంచుకోవడానికి ట్రంప్ ఎన్నికల  ప్రచారం వెనుక రష్యా పాత్ర ఉందనే నిందలూ వచ్చాయి. అంతేకాదు హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలిగా గెలిచే అవకాశాలను తగ్గించాలనే ప్రయత్నం కూడా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

 ముల్లర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఒకసారి ఈ ఆరోపణల నుంచి డొనాల్డ్ ట్రంప్‌ను కాపాడింది. స్టేట్ డిపార్ట్‌ మెంట్ తొలుత రష్యాపై అవిశ్వాసాన్ని పొగొట్టుకోవాలి. రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి.  ప్రస్తుతం పోంపె-లవారోవ్ సమావేశం ఆ దిశగా వేసిన అడుగే అని చెప్పాలి. రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాలనే లక్ష్యంతో వీరిరువురి సమావేశం జరిగింది. అమెరికా పెట్టుకున్న లక్ష్యం వెనుక ఎన్నో అంశాలు ఉన్నాయి. రష్యా-చైనాల మధ్య సన్నిహితత్వాన్ని తగ్గించాలన్నది ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇటీవల కాలంలో రష్యా-చైనాల మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. అంతేకాదు వాణిజ్య విషయాల్లో చైనాతో వాషింగ్టన్ లావాదేవీలు కష్టంగా మారే అవకాశం ఉంది. రష్యా, అమెరికాల మధ్య ఒత్తిడులు సరళతరమైతే  ఇరాన్‌పై అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి బాగా పనిచేసే అవకాశం ఉంది. అంతేకాదు సిరియాలో మార్పు తెచ్చే విషయంలో అమెరికా అసమర్థత కూడా బయటకు వెల్లడికాదు.

 అయితే ట్రంప్ ప్రభుత్వం రష్యా దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. యూరప్‌తో ఎనర్జీ సహకారం పరంగా రష్యా బాగా ప్రయోజనాలను పొందుతోంది. నాటోపై ట్రంప్  దెబ్బతీసే ప్రకటన చేయడంతో ట్రాన్స్-అట్లాంటిక్ భాగస్వామ్య పక్షాల మధ్య నిశ్శబ్దంగా దూరం పెరుగుతూ వస్తోంది. అంతేకాదు ట్రాన్స్-అట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్ పార్టనర్‌షిప్ పరంగా సహకారం అందించని ధోరణులు కనిపిస్తున్నాయి. మరోవైపు చైనాతో రష్యా కొనసాగిస్తున్న వ్యూహాత్మక, ఎనర్జీ భాగస్వామ్యం దానికి లాభసాటిగా ఉంది. అమెరికా చేపట్టిన కౌంటరింగ్ అడ్వర్సరీస్ విత్ శాంక్షన్స్ యాక్ట్ (సిఎటిఎస్ఎ)తో పాటు ఇతర అంశాలు  భారత్, టర్కీ లాంటి ఎన్నో దేశాలకు రష్యా ఆయుధాల అమ్మకాలకు అడ్డుకట్టవేశాయి. ఇవన్నీ మాస్కోకు ఇబ్బందికరంగా పరిణమించాయి.

అమెరికా, రష్యాల మధ్య అనుకూల, సహకార సంబంధాలు అంతర్జాతీయ సుస్థిరతకు చాలా అవసరం. ఇండియా ప్రయోజనాలు కూడా తీరతాయి. అమెరికా-రష్యాల మధ్య కొనసాగుతున్న ఒత్తిడుల్లో ఇండియా  బాధితురాలవుతోంది.  అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు భారత్ ఎవరి పక్షం వహించలేదు. అలాగే ఈ రోజు కూడా అమెరికా, రష్యాల మధ్య చోటుచేసుకున్న ఒత్తిడుల్లో ఒక పక్షం వైపు మొగ్గడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భారత్ భావించింది. అమెరికా మనదేశంలో ఆయుధాల కొనుగోళ్లను విస్తరించాలని భావిస్తోంది. దీన్ని సాధించడం కోసంగా అమెరికా రష్యా నుంచి భారత్ చేసే ఆయుధాల కొనుగోళ్లకు ఆటంకాలను  సృష్టించాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిఫణుల కొనుగోలు పరంగా కూడా అమెరికా భారత్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తానని హెచ్చరించింది. ఇది భారత-అమెరికా సంబంధాల వృద్ధికి పెనుసవాలుగా నిలిచింది. వాషింగ్టన్-మాస్కోల మధ్య సత్సంబంధాలు భారత్‌కు మంచిది.

రచన: ప్రొ. చింతామణి మహాపాత్రా, ప్రొ విసి అండ్ ఛైర్మన్, అమెరికన్ స్టడీస్ సెంటర్, జెఎన్‌టియు