ముగిసిన 17వ లోకసభ ఎన్నికల పోలింగ్

పదిహేడవ లోకసభ (భారత పార్లమెంట్ దిగువ సభ) ఎన్నికలు అత్యంత కోలాహలంగా ముగిసాయి. ఓటర్ల నుంచి అనూహ్యమైన స్పందన కనిపించింది. మొత్తంగా చూస్తే, 2019 లోకసభ ఎన్నికల్లో 900 మిలియన్ ఓటర్లలో 66 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీని ద్వారా భారత దేశం మరోసారి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న తన శ్రద్ధ, శక్తి, విశ్వాసాన్ని ప్రపంచానికి చాటింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో ఓటర్లు ఎన్నికల పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్లకు తగు సదుపాయాలు సమకూర్చింది. మూడు అడుగుల ఎత్తు ఉన్న వినితా జైన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకొని ఎంతో గర్వంగా ఇంకుతో కూడిన తన చేతి వేలిని ప్రదర్శించింది. మొట్టమొదటి సారి జంట కవల సోదరీమణులు సబా, ఫరాలు బిహార్‌లోని పట్నాలో తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోకసభ ఎన్నికలు విదేశాల్లో ఉన్న భారతీయులను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే అనేక మంది విదేశాల నుంచి తరలి వచ్చి మరీ ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాదు, రోజు వారి కూలీలు కూడా తమ పని ప్రదేశాలను వదిలి వేసి ఓటు వేసేందుకు తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. ఇలా భారీ ఎత్తున్న జనం ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రధాన కారణం ఓటర్ల సమీకరణకు భారీ ఎత్తున చేపట్టిన అవగాహన, ప్రచార కార్యక్రమాలు మాత్రమే. ఈ ఎన్నికల కోసం కొత్తగా 85 మిలియన్ ఓటర్లు కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్నారంటే ఎన్నికల కమిషన్ చేసిన కసరత్తు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

చివరి దశ ఎన్నికలు ఆదివారం జరిగాయి. 59 లోకసభ సీట్ల కోసం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని దశల్లో కలిపి మొత్తం 542 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ వెల్లూరు (తమిళనాడు) నియోజక వర్గంలో ఎన్నికలు నిలిపి వేసింది. ఎన్నికలు విజయం కోసం డబ్బు పంపిణీ చేయడంతో ఈ ఎన్నిక నిలిచి పోయింది. భారత రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను లోకసభకు నామినేట్ చేస్తారు. దీంతో లోకసభలో మొత్తం సభ్యుల సంఖ్య 545 అవుతుంది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో 102 ఏళ్ల శ్యామ్ సరన్ నేగి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినపుడు పోలింగ్ అధికారులు సంతోషంగా ఆయనకు ఆహ్వానం పలికారు. నేగికి దగ్గిన సాదర ఆహ్వానానికి కేవలం అతని వయసు మాత్రమే కారణం కాదు, భారత దేశంలో ఆయనే తొలి ఓటర్ కూడా. ఆయన 1951 ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. ఆయన స్వరాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు బిహార్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కేంద్రపాలిత ప్రాంతాలైన ఛండీగడ్‌లలో ఏడవ, చివరి దశలో పోలింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు 918 మంది అభ్యర్థులు ఈ దశలో పోటీలో ఉన్నారు. దాదాపుగా 10 మిలియన్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటింగ్ చేయాల్సి ఉండగా, ఆశాజనకమైన రీతిలో 64 శాతం మంది ఓటింగ్‌లో పాలుపంచుకున్నారు.

ఎన్నికల్లో లింగ బేధం లేకుండా స్త్రీ, పురుషులు దాదాపు సమాన నిష్పత్తిలో పాల్గొన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌ను అభినందించక తప్పదు. 2009లోని లోకసభ ఎన్నికల్లో స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో తొమ్మిది శాతం తేడా ఉంటే, అది 2014గా 1.4 శాతానికి చేరుకుంది. కాగా, ఈ ఎన్నికల్లో అది 0.4 శాతం మాత్రమే. కొన్ని రాష్ట్రాల్లోనైతే పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా పోలింగ్‌లో పాలుపంచుకున్నారు.

ఎన్నికల సంఘం 38 రోజుల్లో దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను చెందిన లక్షలాది మంది సిబ్బంది సహకారంతో విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేసింది. వందలాది కంపెనీల పారామిలటరీ బలగాలు ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేందుకు దోహదపడ్డాయి. సరైన ఫలితాలు రావాలంటే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. ఎలాంటి ప్రలోభాలు ఉండకూడదు. ఇందుకోసం ఎన్నికల సంఘం నగదు చలామణి, మద్యం, ఇతర ప్రలోభాలపై డేగ కన్ను సారించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాలుగా స్వాధీనం చేసుకున్న ఇలాంటి వస్తువుల విలువ రూ. 3,400 కోట్లకు పైగానే ఉంటుంది. ఎన్నికల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఖర్చు కన్నా స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువే అధికంగా ఉండడం గమనార్హం. అయితే స్వాధీనం చేసుకున్న సొమ్మును భారత దేశ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేస్తారు. దాన్ని బడ్జెట్‌లో పొందుపరుస్తారు.

ఇప్పటి వరకు జరిగిన 17 లోకసభ ఎన్నికల్లో తొమ్మిదో సారి ఓటింగ్ 60 శాతం దాటడం గమనార్హం. ఇందుకు ఓటర్లను కూడా అభినందించాల్సిందే. భారత దేశ ప్రజాస్వామిక పాలన పట్ల వాళ్లకు ఎంత నమ్మకం ఉందో ఈ ఓటింగ్ శాతం చెప్పకనే చెబుతోంది.

ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ నమూనాగా పేపర్ ప్రింటవుట్ పద్ధతిలో (వీవీప్యాట్) ఓటర్లను లెక్కించే కొత్త పద్ధతి ప్రవేశ పెట్టారు. మొత్తం మీద 2019 లోకసభ ఎన్నికలు భారత దేశంలో అధికారం బ్యాలట్ ద్వారానే బదలాయింపబడుతుందని సాధికారికంగా నిరూపించింది.

రచన : మనీష్ ఆనంద్, సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్