మంగోలియా అధ్యక్షుడు భారత పర్యటనతో పునరుద్ధరించబడిన సంబంధాలు

మంగోలియా అధ్యక్షుడు ఖాల్ట్‌మాగిన్ బట్టుల్గా భారత దేశంలో అధికారిక పర్యటన చేశారు. భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేక ఆహ్వానంపై మంగోలియా అధ్యక్షుడు మన దేశాన్ని సందర్శించారు. గత దశాబ్దకాలంలో ఒక మంగోలియా అధ్యక్షుడు భారతదేశాన్ని పర్యటించడం ఇదే తొలిసారనొచ్చు. మంగోలియా అధ్యక్షుడితో పాటు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారుల బృందం, వాణిజ్యాధినేతలు కూడా వచ్చారు.

మంగోలియా అధ్యక్షుడు బట్టుల్గా భారత రాష్ట్రపతి కోవింద్‌తో విస్తృతస్థాయిలో  చర్చలు చేశారు. భారతదేశంలో పర్యటిస్తున్న మంగోలియా అధ్యక్షుడు గౌరవార్థం భారత రాష్ట్రపతి కోవింద్ విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మంగోలియా అధ్యక్షుడిని గౌరవపురస్కకరంగా కలిశారు. ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని మంగోలియా అధ్యక్షుడితో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఇరు దేశాలూ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక అంశాలపై సంభాషణలు జరిపారు. అలాగే ప్రాంతీయ, గ్లోబల్ అంశాలపై కూడా చర్చలు జరిపారు. సామర్థ్య పెంపుదల, రక్షణ, భద్రత, మౌలికసదుపాయాలు, ఎనర్జీ, ప్రకృతి వైపరిత్యాల వల్ల సంభవించిన నష్ట నిర్మూలనా నిర్వహణ, సాంస్కృతికంగా ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి వాటిల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఎజెండాగా రెండు దేశాలు పెట్టుకున్నాయి. మంగోలియా ప్రెసిడెంట్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య పదిహేను రోజుల వ్యవధిలో రెండవసారి సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగోలియా ప్రెసిడెంట్‌తో ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో సమావేశమయ్యారు  రష్యా దూర ప్రాచ్యంలోని వ్లాదివోస్తోక్‌లో జరిగిన ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ (ఇఇఎఫ్) సమావేశ సమయంలో ఇరుదేశాల నాయకులు తిరిగి కలుసుకున్నారు. 

తూర్పు దేశాలతో తన సంబంధాలను భారత్ తిరిగి పునరుద్ధరించుకుంటోంది. భారత ప్రధాని మోదీ 2015లో మంగోలియాలో పర్యటించారు. ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించు కుంది. 2015లో రెండు దేశాలు ఒక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ప్రధానంగా రెండు దేశాలూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఆ ఒప్పందంలో అంగీకరించాయి. అది కూడా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి ఉన్నత విలువల భూమికగా సాగాలని ఇరు దేశాలూ కోరుకున్నాయి. ఇరుదేశాల్లో బుద్ధిజం మూలాలు ఉండడాన్నికూడా ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. మంగోలియా అధ్యక్షుడు ఐదు రోజులపాటు భారతదేశంలో పర్యటించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

భారత్, మంగోలియాల మధ్య దౌత్య సంబంధాలు 1955 డిశంబరు నుంచి ప్రారంభమయ్యాయి. ఇది ల్యాండ్ లాక్డ్  దేశం. మంగోలియాకు రెండే రెండు పొరుగుదేశాలు ఉన్నాయి. ఒకటి రష్యా, రెండవది చైనా. ఇతర దేశాలను చేరాలంటే మూడవ పొరుగుదేశం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. చాలామంది మంగోలియన్లు భారతదేశాన్ని ఆథ్యాత్మిక పొరుగుదేశంగా భావిస్తారు. కారణం ఇరుదేశాల మధ్య బలమైన బుద్ధిజం మూలాలు ఉండడమే కాదు, చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయి. మంగోలియాకు భారత మాజీ రాయబారి అయిన బకులా రిమ్‌పోచ్‌ని దేశంలో ఎంతో ఆత్మీయంగా తలచుకుంటారు. ఉలాన్ బాతార్‌లో 1990-2000 వరకూ అంటే ఒక దశాబ్ద కాలంపాటు ఉన్నారు. భారతదేశంతో ఉన్న బుద్ధిజం సంబంధాల వారసత్వాన్ని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో  కృషిచేశారు. ఎన్నో బౌద్ధారామాల పునరుద్ధరణలో ఆయన తోడ్పడ్డారు. 

మంగోలియాలో విస్తృతస్థాయిలో సహజవనరులు ఉన్నాయి. ఇది పెద్ద దేశం. కానీ జనాభా మాత్రం ఎక్కువగా ఆ దేశ రాజధాని ఉలాన్ బాతర్‌లో కేంద్రీకృతమై ఉంది. భారత, మంగోలియాల మధ్య వాణిజ్య సంబంధాలు తక్కువగా ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్యం 23.83 మిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే, ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు పెరిగాయి. వాణిజ్య సమతుల్యత భారతదేశానికి అనుకూలంగా సాగుతోంది. భారత తూర్పు దేశాల కార్యకలాపాలలో మంగోలియా కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది. 

గ్లోబల్ దృష్టి ఇప్పుడు తూర్పు వైపు ఉంది. భారత్ కూడా తూర్పు వైపుకు పయనించడానికి ప్రయత్నాలు చేస్తోంది. భారత్ తన యాక్ట్ ఈస్ట్ విధానాన్ని ఎంతో చురుగ్గా కొనసాగిస్తోంది. అంతేకాదు ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ విధానాలను కూడా భారత్ అనుసరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సమయంలో దీన్ని ప్రకటించారు.  ప్రపంచంలోని తూర్పు ప్రాంతంతో భారత సహకారం,కార్యకలాపాలలో మంగోలియా ఎంతో క్లిష్టమైన పాత్రను నిర్వహిస్తోంది. భారత్ ‘ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు’ను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఒక బిలియన్ అమెరికా డాలర్లతో నిర్వహిస్తున్నట్టు ప్రధాని మోదీ తన 2015 సంవత్సరం పర్యట సమయంలో ప్రకటించారు.  

న్యూఢిల్లీ ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ని రష్యాకు కూడా 2019 సెప్టెంబరులో ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించినపుడు ప్రకటించారు. 

కీలక అంతర్జాతీయ అంశాలపై మంగోలియా కూడా భారత తరహా అభిప్రాయాలనే పంచుకుంటోంది. అంతేకాదు ఈ దేశం షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ)కి పరివీలక దేశంగా వ్యవహరిస్తోంది. అందులో భారత్ 2017 సంవత్సరం నుంచి సభ్యరాలిగా ఉంది. 

రక్షణ, భద్రతా రంగాలలో కూడా భారత్, మంగోలియాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయి. ఇండో-మంగోలియా జాయింట్ ఎక్సెర్‌సైజ్ అయిన ‘నోమాడిక్ ఎలిఫెంట్’ ప్రతి ఏడాది జరుగుతుంది. భారత, మంగోలియా ప్రజల మధ్య సాంస్కృతిక సహకారం కూడా గత కొన్నేళ్లుగా బాగా వృద్ధి చెందుతూవస్తోంది. మంగోలియా అధ్యక్షుడు బట్టుల్గా భారత పర్యటన వల్ల భారత, మంగోలియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా, లోతుగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు.

 

రచన: డా. అథార్ జాఫర్, సిఐఎస్ వ్యూహాత్మక విశ్లేషకులు