హౌడీ మోది- అపూర్వ ఘటన

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా సంయుక్తరాష్ట్రాల పర్యటన ‘హౌదీ మోదీ’ కార్యక్రమంతో అత్యంత విజయవంతంగా మొదలైంది. ఈ కార్యక్రమం టెక్సాస్‌లోని హూస్టన్‌లో జరిగింది. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరువురూ ఈ వేదికపై పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి మోదీ 50 వేల ఇండో-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు కూడా.

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలోని భారత కమ్యూనిటీని ఉద్దేశించి 2014లో న్యూయార్కులోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రసంగించడం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు 2015లో శాన్ జోస్‌లో కూడా మోదీ మాట్లాడారు. అయితే హూస్టర్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనడంతో అది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లతో పాటు సీనియర్ డెమోక్రాట్, కాంగ్రెస్ సభ్యుడు అయిన స్టెనీ హోయర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత, అమెరికా సంబంధాలలో ద్వైపాక్షిక మద్దతును నొక్కి చెప్పారు. 

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సభకు పరిచయం చేస్తూ ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల గుండెచప్పుడుగా అభివర్ణించారు. ట్రంప్‌ను తన మిత్రునిగా మోదీ పేర్కొన్నారు. ‘నా స్నేహితుడు, భారత స్నేహితుడు, అమెరికా అత్యున్నత అధ్యక్షుడు అంటూ ఆయన పట్ల, ఆయన నాయకత్వం పట్ల తన ఇష్టాన్ని మోదీ వ్యక్తంచేశారు. మేక్ అమెరికా గ్రేట్ పట్ల భారత నిబద్ధతను ప్రధాని వ్యక్తంచేశారు. 

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతో చారిత్రకమైనదని వ్యాఖ్యానించారు. మొత్తం ఇండియా, అమెరికాలకు ఇది పెద్ద సంబరంగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నాయకత్వం పట్ల ప్రశంసలు కురిపించారు. పేదరికం నుంచి 300 మిలియన్ల భారతీయులను బయటపడేయడంలో మోదీ కృషిని మెచ్చుకున్నారు. అంతేకాదు నాలుగు మిలియన్లమంది ప్రవాస భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇండియన్ అమెరికన్లు ఎంతో కష్టపడతారన్నారు. ముఖ్యంగా వైద్యం, కొత్త వ్యాపారాల స్థాపన, వేలమందికి ఉఫాది కల్పనలో ప్రవాస భారతీయుల కృషిని ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా బలోపేతం అయ్యాయన్నారు. ఎనర్జీ కో-ఆపరేషన్, భద్రత,రక్షణ సహకారం, అంతరిక్ష సహకారం వంటి వాటిని ట్రంప్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు దేశాలు ఉగ్రవాదానికి, రాడికలైజేషన్‌కి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతాయని అనడంతో   సభలోని సభ్యులు లేచి నించుని తప్పట్లు కొడుతూ అభినందించారు. భారత కంపెనీలు అమెరికాలు పెట్టుబడులు పెట్టడాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 

 

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత అభివృద్ధి పట్ల తన విజన్ వెల్లడించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ‘మాకు మేమే సవాళ్లు విసురుకుంటున్నాం. మేం మారుతున్నాం…’ అన్నారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గత ఐదేళ్లలో గ్రామీణ పారిశుద్ధ్యం 38 శాతం నుంచి 99 శాతానికి విస్తరించింది. మొత్తం 110 మిలియన్ల టాయిలెట్లను నిర్మించారు. అంతేకాదు 150 మిలియన్ల కొత్త వంటగ్యాసు కనెక్షన్లను కూడా ఇచ్చామని తెలిపారు. గ్రామీణ అనుసంధానత 55 నుంచి 97 శాతానికి పెరిగింది. అంతేకాదు గ్రామీణప్రాంతాలలో నూరు శాతం బ్యాంకింగ్ కవరేజ్ ఉంది. డిజిటల్ ఇండియా ద్వారా తక్కువ ఖర్చుతో, సులభంగా వ్యాపారం చేయగలుగుతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థ గురించి వివరిస్తూ, చాలా తక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందన్నారు. అలాగే ద్రవ్య లోటు కూడా తక్కువగా ఉందన్నారు. పెరుగుదల రేటు అధికంగా ఉందని పేర్కొన్నారు. మౌలికసదుపాయాలపై ఖర్చును పెంచే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. అలాగే పెట్టుబడులు, ఎగుమతులను కూడా పెంచాలనుకుంటున్నట్టు తెలిపారు. భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికరంగ టార్గెట్‌ను పెట్టుకున్న విషయం తెలిసిందే. వివిధ రంగాలలో నిబంధనలు సరళీకృతం చేయడంతో ప్రత్యక్ష విదేశీపెట్టుబడులకు భారత్ మంచి ప్రదేశంగా మారింది కూడా. 

 

 కాలంచెల్లిన విధానాలకు, పద్ధతులకు భారత్ స్వస్తి చెప్పినట్టు ప్రధాని పేర్కొన్నారు. భారత్ 370వ ఆర్టికల్‌కు స్వస్తి పలికినట్టు పేర్కొన్నారు. 70 ఏళ్ల పాత చట్టం వల్ల జమ్ము,కశ్మీర్ ప్రజలు, లడఖ్ ప్రజలు అభివృద్ధి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలను కోల్పోయారన్నారు. అంతేకాదు ఆ ప్రాంతాలను వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ఉపయోగించుకున్నారని విమర్శించారు. 

 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, రెచ్చగొట్టే శక్తులపై గట్టి పోరాటం చేస్తమంటూ భారత్ పిలుపిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ ‘9/11 (సెప్టెంబరు 2001) ఉగ్రదాడి అమెరికాకు వ్యతిరేకంగా జరిగినది , అలాగే భారత్‌లో 26/11 (నవంబరు, 208) దాడులు కానీ వీటికి కారకులైన వారు ఎక్కడ ఉన్నారు అంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 

 

  ప్రధాని నరేంద్ర మోదీ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా వర్ణించారు. హౌదీ మోదీ పై మంచి స్పందన వచ్చిందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య మూలాలలోని  ఈ వైవిధ్యం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.  

 

 హౌదీ మోదీ కార్యక్రమం అమెరికా, భారత దేశాల నాయకులు మరింత విస్తృతస్థాయిలో చర్చలు జరపడానికి వీలు కల్పించింది. న్యూయార్కులో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలను చర్చించడంతో పాటు పలు అంశాలను చర్చించే అవకాశం లభించింది. ఈ కార్యక్రమం అమెరికా, భారత దేశాల సంబంధాలలోని స్నేహం, సన్నిహితత్వం, పటిష్టమైన బంధాలకు ప్రత్యేక ఉదాహరణగా చెప్పాలి. 

 

హౌస్టన్‌లో కాలు పెట్టగానే ప్రధాని మోదీ ఎనర్జీ కంపెనీలకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వీరి చర్చలు ప్రధానంగా ఎనర్జీ భద్రత, భారత్, అమెరికాల మధ్య పరస్పర పెట్టుబడులను పెంచుకునే అవకాశాల మీద దృష్టిసారించారు. అక్కడి భారత కమ్యూనిటీని కూడా ప్రధాని నరేంద్రమోదీ కలిశారు. 

 

ప్రధాని నరేంద్ర మోదీ న్యూ యార్కు వచ్చారు. అక్కడ ఆయన 74వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతోపాటు పలు ద్వైపాక్షిక సమావేశాలకు సైతం హాజరవుతారు.

 

రచన: అంబాసిడర్ నవ్‌తేజ్ సర్నా, అమెరికా మాజీ భారత రాయబారి