ఉగ్రవాదంపై తన  ఉద్దేశాన్ని ఫిన్లాండ్‌కు స్పష్టం చేసిన భారత్

భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. ఎస్ జైశంకర్ మూడు రోజుల పర్యటనకు ఫిన్లాండ్ వెళ్లారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నోర్డిక్ దేశంలో పర్యటించడం ఆయనకు ఇదే తొలిసారి.1950 నుంచి సంప్రదాయబద్ధంగా అత్యున్నత స్థాయి పర్యటనలు ఆ దేశంతో చోటుచేసుకుంటూనే వస్తున్నాయి. ద్వైపాక్షిక అంశాల మీద దృష్టి నిలపడం కన్నా కూడా ఫిన్లాండ్ ప్రస్తుతం యురోపియన్ కూటమి ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో స్నేహంగా, సహృదయ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. కారణం పొరుగుదేశంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలే.

ఫిన్లాండ్‌కు చెందిన అత్యున్నత అధికారులతో డా. జైశంకర్ విస్తృతస్థాయిలో సరిహద్దు తీవ్రవాదంపై చర్చలు జరిపారు. భారత్ 370వ రాజ్యాంగ అధికరణ రద్దు చేసిన అనంతరం అంతర్జాతీయ సమాజం ముందు పొరుగుదేశమైన పాకిస్తాన్ లేనిపోని కథలను కశ్మీర్‌పై అల్లి ప్రపంచదేశాలను తప్పుదారిపట్టించే ప్రయత్నాలు చేస్తోంది. జైశంకర్ ఫిన్నిష్ ప్రధాని అంట్టిరిన్నెతో కూడా చర్చలు జరిపారు. అంతేకాదు ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టోతో హెల్సింకిలో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయిలో సంభాషణలు జరిపారు. ముఖ్యంగా గ్రీన్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు.

ఫిన్నిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (ఎఫ్ఐఐఎ)లో మంత్రి జైశంకర్ ‘ఇండియా అండ్ వరల్డ్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ భారత  ప్రభుత్వం ప్రస్తుతం సాధించిన విజయాలను వివరించారు. ఈనాటి భారత విదేశాంగ విధానం బలమైన అభివృద్ధి దృక్కోణంలో కొనసాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధి కోసం   అవకాశాలను శోధించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రపంచం విజ్ఘానంతో కూడిన ఆర్థిక వ్యవస్థ వైపుగా కదులుతుంటే, అదనపు సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ దిశగా పరస్పర ప్రయోజనాలను సాధించుకునేందుకు చాలా దూరం ప్రయాణించవలసి ఉందని డా. జైశంకర్ అన్నారు.

 భారత్ జమ్ము, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై నొక్కి మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసం, అవసరాల కోసం, అభివృద్ధి కోసం, అలాగే జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జాతీయ భద్రతా సమస్యల గురించి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల కాలంలో 40 వేల భారతీయుల జీవితాలను బలితీసుకుందన్నారు. 

అంతర్జాతీయ ఉగ్రవాదంపై స్పందిస్త్, భారత్ సుదీర్ఘకాలంగా ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటోందన్నారు. అలాగే ప్రపంచంలోని పలు ప్రాంతాలు కూడా ఉగ్రవాద దాడులకు లోనుకావడాన్ని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకించే అంతర్జాతీయ గళం  అవసరమన్నారు. అన్ని రూపాలలో శక్తివంతంగా ఈ పని చేయాలన్నారు. తన ప్రసంగంలో, భారత్ ఆఫ్ఘన్ భవిష్యత్ గురించి కూడా ఆలోచిస్తోందన్నారు. గల్ఫ్ ప్రాంతంలో సుస్థిరత నెలకొనడంపై, పాకిస్తాన్ ఛాయిస్‌ల గురించి డా. జైశంకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ అంశాలపై ఆందోళనను వ్యక్తంచేస్తూ భారత విదేశాంగ మంత్రి ఈ ప్రాంతంలో శాంతియుత ప్రయోజనాల సాధనకు రక్షణపరంగా   భారత్ చేయూతనిస్తూ వస్తోందన్నారు.

 పెద్ద దేశాలతో భారత సంబంధాల విషయానికి వస్తే డా. జైశంకర్ మాట్లాడుతూ పెద్ద దేశాలతో సన్నిహిత స్నేహ సంబంధాలను కొనసాగించడమే భారత ఉద్దేశమన్నారు. నేడు భారత్ ‘మల్టీ-పోలార్’ (బహు ధృవ) స్వభావం గల ప్రపంచంలో నిలబడి ఉందన్నారు. వైవిధ్యమైన సంభాషణలకు నేటి ప్రపంచం నిలయంగా ఉందన్నారు. విదేశాలకు సంబంధించి భారత బాధ్యతలు, సున్నితత్వం పరంగా కట్టుబడి ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న భారత్ నేడు కలుపుకుపోయే, వైవిధ్యమైన, ప్రజా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అంతేకాదు డా. జైశంకర్ ఫిన్నిష్ తొలి డిప్యూటీ స్పీకర్ తూలా హతైనెన్‌తో, అలాగే ఫిన్నిష్ పార్లమెంటుకు చెందిన విదేశ వ్యవహారాల కమిటీతో కూడా చర్చలు జరిపారు. ఫిన్నిష్ ప్రెసిడెంట్ సాలి నినిస్తోను కూడా కలిశారు. అంతేకాదు మంత్రి జైశంకర్ ఫిన్లాండ్‌కు ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) నుంచి మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా బహుమతిగా ఇచ్చారు. ఆ విగ్రహాన్ని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆవిష్కరించారు. 

కశ్మీర్ భారత అంతర్గత విషయంగా అన్ని చోట్ల మనదేశం స్పష్టంచేస్తూ వస్తోంది. ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం మద్దతును సైతం భారత్ పొందింది. అంతేకాదు భారత్ ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలైన   అమెరికా, యుకె, రష్యాల నుంచి సైతం కశ్మీర్ అంశంపై అనుకూల మద్దతును గెలుచుకుంది. ఎఫ్ఐఐఎలో భారత విదేశాంగ మంత్రి డా. జైశంకర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే అందులో కశ్మీర్ అంశంపై భారత స్టాండ్ అందులో విస్పష్టంగా ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని సమిష్టిగా ఖండించాల్సిన అవసరం ఉందన్న భారత అభిప్రాయం కూడా ఆయన ప్రసంగంలో వెల్లడైంది. యురోపియన్ కూటమి కశ్మీర్‌లోని పరిస్థితులను సన్నిహితంగా పర్యవేక్షిస్తోంది. పరస్పర ప్రయోజన కరమైన శక్తివంతమైన ద్వైపాక్షిక సంబంధాలకోసం శోధించడంతో పాటు యురోపియన్ కూటమిని, ఆ కూటమి ఛైయిర్ ఫిన్లాండ్‌ని కూడా భారత జాతీయ రక్షణ సందర్భార్థానికి ఉపయోగకరంగా ఈ పర్యటన ఎంతో లాభకరమైంది.

రచన: డా. సంఘమిత్ర శర్మ, యురోపియన్ వ్యవహారాల విశ్లేషకులు