అంశం : FATF హెచ్చరిక అనంతరం గ్రే లిస్ట్ లోనే పాకిస్థాన్ కొనసాగింపు

కశ్మీర్ ఆక్రమిత పాకిస్థాన్ లో కొన్ని సైనిక స్థావరాలు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని భారత్ సైన్యం కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ అతిక్రమించటంతో అందుకు ప్రతిగా భారత్ ఈ చర్యకు దిగింది. ఈ సందర్భంగా పలువురు పాకిస్థాన్ సైనికులతో పాటు ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు.

ముఖ్యంగా జమ్ము-కశ్మీర్ లో 370 అధికరణ రద్దు తర్వాత పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతోంది. కశ్మీరు అంశంపై అంతర్జాతీయ సమాజం నుంచి సానుభూతిని కూడగట్టడంలో ఇస్లామాబాద్ ఘోరంగా విఫలమైంది. ఇక చేసేది లేక నిస్సహాయ స్థితిలో ఇటువంటి ఉల్లంఘనలకు, ఉగ్రవాదుల చొరబాట్లకు పాల్పడుతోంది. అయితే దాని చర్యలన్నింటినీ భారత సైనిక దళాలు సమర్ధంగా విజయవంతంగా తిప్పికొడుతున్నాయి.

ఇలా ఉండగా పారిస్ లో జరిగిన ఆర్థిక కార్యాచరణ టాస్కుఫోర్సు  – FATF – ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్ ను ఫిబ్రివరి 2020 వరకు తన త్రిశంకు జాబితా – గ్రేలిస్ట్ లో కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విధంగా  ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్నీ, ఉగ్రవాదులు వారి సంస్థలచే మనీలాండరింగునూ గట్టిగా సత్వరమే అరికట్టే చర్యలు చేపట్టడానికి పాకిస్థాన్ కు మరో 4 నెలల గడువును ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా ఈ విషయంలో సంపూర్ణ కార్యాచరణ  ప్రణాళికను పూర్తి చెయ్యాలనే కఠిన హెచ్చరికతో ఈ గడువును పొడిగించారు. పూర్థి స్థాయి కార్యాచరణ ప్రణాళికలో గణనీయమైన, సుస్థిరమైన పురోగతి లేని పక్షంలో పాకిస్థాన్ ను బ్లాక్ లిస్టులో జేర్చటంతో పాటు ఆర్థిక, వ్యాపార లావాదేవీలపై ఆంక్షలు విధించటం  వంటి కఠిన చర్యలు చేపడతామని FATF – ఒక ప్రకటనలో హెచ్చరించింది.

భౌగోళిక ప్రమాణాల  కనుగుణంగా పాకిస్థాన్ చర్యలు తీసుకోవటం లేదని కూడా FATF ఆరోపించింది.  ఉగ్రవాదులకు నిధులు కూర్చే విషయంలో పాకిస్థాన్ చర్యలు ఏమా్రతం సంతృప్తికరంగా లేవని కూడా స్పష్టం చేసింది. FATF   విధించిన 27 అంశాలలో కేవలం 5 అంశాలపై మాత్రమే పాకిస్థాన్ చర్యలు తీసుకుందని చెప్పింది. భారత్ లో పలు దాడులకు బాధ్యులైన లష్కరే తయ్యబా, జైషేమొహమ్మద్ వంటి ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చటాన్ని నియంత్రించలేదని  FATF పేర్కొంది.

 కాగా పాకిస్థాన్  తన మార్గాలను మార్చుకోవటానికి మరో అవకాశం  ఇవ్వాలని కోరటంతో ఈసారి బ్లాక్ లిస్టులో జేర్చకుండా పాకిస్థాన్ బతికిబైటపడింది. బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఉండాలంటే మొత్తం 39 సభ్యదేశాలలో కనీసం  3 దేశాల మద్దతు కావాలని FATF నిబంధనలు చెప్తున్నాయి.

ఇంతవరకు  ఉత్తర కొరియా, ఇరాన్ – ఈ రెండు దేశాలను మాత్రమే FATF బ్లాక్ లిస్టు కింద జేర్చడం జరిగింది. ఇట్టి చర్య తీసుకున్న పక్షంలో  తక్షణమే ఆంక్షలు వర్తిస్తాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి –IMF ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ యూనియన్ తదితర ఆర్థిక సంస్థల నుంచి ఇస్లామాబాదుకు రుణాలు ఆగిపోతాయి. అయితే ఈ 3 దేశాలు కూడా పాకిస్థాన్ కు గడువు పొడిగింపుతోపాటు హెచ్చరిక కూడా జారీ చేసాయి. అంతేకాదు పాకిస్థాన్ మరిన్ని చర్యలు తీసుకోవాలి అది కూడా సత్వరమే నంటూ చైనా ప్రతినిధి, ప్రస్తుత FATF అధ్యక్షుడు హెచ్చరించారు. FATF భౌగోళిక ప్రమాణాలను నెరవేర్చటంలో విఫలమైన పక్షంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఫిబ్రవరి 2020 నాటికల్లా  పాకిస్థాన్ గనుక గణనీయమైన పురోగతి చూపనట్లయితే ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో జేర్చటం ఖాయమని పేర్కొన్నారు.

2018 జూన్ లో FATF – పాకిస్థాన్ ను త్రిశంకు జాబితాలో చేర్చింది. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయంలో పాకిస్థాన్ ప్రమేయాన్ని తీవ్రంగా పరిగణించిన FATF  ఈ చర్యకు ఉప్రకమించింది. అపట్నించి ఎప్పటికప్పుడు జరుపుతున్న సమీక్షలు ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవటంతో త్రిశంకు జాబితా నుంచి పాకిస్థాన్ బైటపడలేకపోయింది.

అయితే ఈ విషయంలో తాను చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నట్టు FATFను పాకిస్థాన్ నమ్మ చూపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ – ఇందుకు సంబంధించి వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పెద్ద ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు.

ప్రపంచ సమాజం అంతా కూడా పాకిస్థాన్ వక్రమార్గాన్ని వీడి సన్మార్గంలో పడటానికి అన్ని అవకాశాలను ఇస్తూనే వస్తున్నట్టు తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ప్రయోజనం మాత్రం శూన్యంగానే ఉంది.

అంతులేని  పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలిపీఠమవుతోంది. ఈ బాధను తాళలేని భారత్ ఇస్లామాబాద్ పై మరింత కఠిన చర్య తీసుకోవాలంటూ ఇచ్చిన పిలుపుకు అమెరికాతో పాటు మిగతా అన్ని సభ్య దేశాలు గట్టి మద్దతును ప్రకటించాయి. ఉగ్ర సంస్థల ఖాతాలను స్థంభింపజేసినప్పటికీ జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజర్ – తన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసి తీసుకునేందుకు అనుమతించిన విషయాన్ని భారత్ ఈ సందర్భంలో ప్రస్తావించి చూపింది. దీనివల్ల ఉగ్రవాదంపై పోరు విషయంలో పాకిస్థాన్ ప్రపంచాన్ని కల్లబొల్లి  మాటలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందని స్పష్టమవుతోంది.

FATF హెచ్చరిక నేపథ్యంలో పాకిస్థాన్ ఏం చర్య తీసుకోబోతోందని ప్రపంచం యావత్తు నిశితంగా గమనిస్తూ ఉంటుంది. ఇకపై స్వప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ ఆ హెచ్చరికను తీవ్రంగా పరిగణించాలి; తక్షణ చర్య తీసుకోవాలి. త్రిశంకు జాబితా నించి నిజింగా బైటపడాలని కోరుకుంటే ఇది తప్పనిసరి. దేశాభివృద్ధికి మార్గం సుగమం కావాలన్నా కూడా ఇలా చెయ్యాల్సిందే.

రచన : అశోక్ హాండూ – రాజకీయ విశ్లేషకులు