అంశం : భారీ మొత్తంలో వంటగ్యాసు (LPG) దిగుమతులపై భారత్ – బంగ్లాదేశ్ మధ్య అవగాహన ఒప్పందం (MOU)

బంగ్లాదేశ్ భారీ మొత్తంలో వంటగ్యాసు – LPG దిగుమతులపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాల మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. దీనివల్ల ఇరు పొరుగు దేశాల నడుమ పరస్పర సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయి.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు వంటగ్యాసు సరఫరా సాఫీగా జరిగేలా చూసే ప్రత్యేక సవాలును మదుర్కొనేందుకుగాను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది.

పరస్పర కష్టాలను అర్థం చేసుకొని వాటిని తీర్చే మార్గాలను కనుగొనటంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సుహృద్భావ వాతావరణానికి ఇది అద్దం పడుతుంది.

బంగ్లాదేశ్ నుంచి భారత సరిహద్దు రాష్ట్రానికి భారీ మొత్తంలో LPG దిగుమతి ద్వారా ఏడాది పొడవునా LPG సరఫరా జరగటమేకాక రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి; సమయం కూడా కలసి వస్తుంది.

ప్రస్తుతం త్రిపుర రాష్ట్రానికి గౌహతి నుంచి మేఘాలయ లేదా సిల్చార్ (287 కి.మీ) మీదుగా LPG సరఫరా జరుగుతున్నాయి. గౌహతి నించి బయలుదేరే LPG ట్యాంకర్లు 600 కిలోమీటర్ల సుదూర ప్రయాణం ఎంతో క్లిష్టంగా వుంటుంది. కొండలు, కొండ చరియలు విరిగిపడే ప్రమాదం వున్న మార్గాల ద్వారా అవి ప్రయాణించాలి. 

ఇక వర్షాలు పడే రోజుల్లో అయితే చెప్పనక్కర్లేదు. రోజుల తరబడి LPG వంటి అత్యవసర సరఫరాలకు అంతరాయం కలుగుతుంది.

బంగ్లాదేశ్ నుంచి నిర్దేశిత ప్రైవేటు సప్లయిర్ల ద్వారా ట్రక్కుల్లో LPG దిగుమతులు ఒకసారి ప్రారంభమయ్యాయంటే అతి సమీపంలోని మోంగ్లా రేవు నుంచి పశ్చిమ త్రిపురలో వున్న ఇండియన్ ఆయిల్ సంస్థ బాట్లింగ్ ప్లాంటుకు ప్రయాణ దూరం కేవలం 120 కిలోమీటర్లకు బాగా తగ్గిపోతుంది. 

నరేంద్రమోది – షేక్ హసీనా ఇరువురు కూడా పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో ఆవశ్యకమని గుర్తించారు.

బంగ్లాదేశ్ లోని రెండు LPG సంస్థలు ఎగుమతుల ద్వారా LPG సరఫరా విధిగా జరిగేలా చూస్తాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ సంస్థ LPG ని సిలిండర్లలో నింపి అమ్మకాలు చేస్తుంది. అలాగే భారత్ తూర్పు తీరంలోని ప్రాంతానికి దీర్ఘకాలికి ఇంధన డెలివరీ ప్రణాళికల దృష్ట్యా కూడా ఈ అవగాహన ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం మన దేశానికి పశ్చిమ తీరంలో చమురు – గ్యాసు దిగుమతి కోసం గట్టి మౌలిక వసతుల సదుపాయం ఉంది.

అంతేకాదు, భారత – బంగ్లాదేశ్ ఒప్పందం వల్ల ఇంతకాలం నిత్యావసర ఇంధన అవసరాలకై అలమటిస్తున్న ప్రాంతానికి గ్యాసు – ఇంధన సరఫరాలు ఖచ్చితంగా అందుతాయి.

ఇంకా LPG ఎగుమతుల వల్ల బంగ్లాదేశ్ కు ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఆదాయం లభిస్తుంది. రెండు దేశాలలో కూడా సౌఖ్యవంతమైన జీవనం ఏర్పడుతుంది. షేక్ హసీనా సమక్షంలో మాట్లాడుతూ నరేంద్రమోదీ ఈ విషయాలు చెప్పారు.

కాగా LPG తోపాటు ఇతర నిత్యావసరాలను భారత్ లోని ఈశాన్య ప్రాంతాలకు దిగుమతి సదుపాయం కల్పించడానికి బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. అంతేకాకుండా భారత మదుపుదారుల కోసం చిట్టగాంగ్ సముద్ర రేవు వద్ద మిర్షరాయ్ ఆర్థిక మండలంలో భారత్ కు 1000 ఎకరాల భూమిని కూడా బంగ్లాదేశ్ కేటాయించింది. అశుగంజ్, మోంగ్లా రేవులను దీర్ఘకాలం వాడుకునేందుకు కూడా భారత్ ను అనుమతించింది. ముఖ్యంగా భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఈ చర్య తోడ్పడుతుంది.  

ఇదే ద్వైపాక్షిక సహకారం స్ఫూర్తితో బంగ్లాదేశ్ – ఈశాన్య భారత్ ల మధ్య అఖోరా మీదుగా రైలు అనుసంధానం మళ్ళీ ఏర్పాటవుతుంది. అలాగే ఫెని నదిమీద వంతెన నిర్మాణం పూర్తికాగానే రహదారులు తెరుచుకుంటాయి. రాకపోకలు ప్రారంభమవుతాయి.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మాట్లాడుతూ – బల్క్ LPG దిగుమతులలో సహకారం మంచి పొరుగు దేశాలుగా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇందుకు ప్రతిగా భారత్ బంగ్లాదేశ్ లో ఇండియన్ ఆయిల్ సంస్థ ద్వారా చమురు మౌలిక వసతుల ఏర్పాటుకై ముందుకు వచ్చింది.

బంగ్లాదేశ్ లోని సముద్ర ప్రాంత ప్రత్యేక ఆర్థిక మండలంలో ఆసియా – పసిఫిక్ ప్రాంతంలోనే అతి పెద్ద చమురు – గ్యాసు నిల్వలు వున్నాయని జియాలజిస్టులు చెప్తున్నారు. ప్రపంచంలో ప్రధానమైన హైడ్రో కార్బన్ ఉత్పత్తిదారుగా బంగ్లాదేశ్ ఎదగటానికి బారత్ భాగస్వామిగా చేరి తన వద్ద గల సాంకేతిక నైపుణ్యంతో సహాయం చేయవచ్చు. 

ఈనాడు భారత్ – బంగ్లాదేశ్ సంబంధాలు మానవీయత – వారసత్వం – చురుకైన భాగస్వామ్యం – అత్యున్నత స్థాయిలో మార్పిడి – అంశాల ఆధారంగా నెలకొని ఉన్నాయి. ఇరుదేశాల మధ్య 9 బిలియన్ అమెరికా డాలర్లుగా వున్న ద్వైపాక్షిక వాణిజ్యం కూడా 2018-19లో 10.46 బిలియన్ డాలర్లకు చేరింది. గ్యాస్ గ్రిడ్ ఏర్పాటుపై కూడా భారత్ – బంగ్లాదేశ్ తో కలిసి పని చేస్తోంది. 

బంగ్లాదేశ్ LNG ని పైపు లైన్ల ద్వారా ఈశాన్య భారతదేశానికి దిగుమతి చెయ్యాలనేది లక్ష్యం. గడచిన దశాబ్దానికి పైగా కాలంలో భారత్ లో ఇంధన వినియోగం ఇబ్బడిముబ్బడిగా అత్యంత వేగంగా పెరిగిపోయింది. 2040 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ఈ పరిణామాలు రెండు దేశాలకూ శ్రేయోదాయకమైనవే. పరస్పర ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సహకరించుకోవాలని ఇరుదేశాలు పట్టుదలతో ఉన్నాయి.

రచన : దీపాంకర్ చక్రవర్తి – ది స్టేట్స్ మన్ ప్రత్యేక ప్రతినిధి