భారత – అమెరికా ఆర్థిక..ద్రవ్య భాగస్వామ్య 7వ సమావేశం

   ‘భారత్-అమెరికా ఆర్థిక.. ద్రవ్య భాగస్వామ్య’ 7వ సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యం. ఇందులో పాల్గొన్న భారత-అమెరికా ప్రతినిధి బృందాలకు రెండు దేశాల ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్, స్టీవెన్ మెనూషిన్ నాయకత్వం వహించారు. భారతదేశం 2022లో జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాము అవసరమైన మద్దతిస్తామని ఈ సమావేశంలో అమెరికా హామీ ఇచ్చింది. అంతర్జాతీయ రుణ సహనీయత, ద్వైపాక్షిక రుణసాయంలో పారదర్శకతలపై సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. ఆర్థిక వృద్ధి కోసం పెట్టుబడులలో అంతర్జాతీయ ఏకీకరణ దిశగా భారత ప్రణాళికలకు ఈ చర్చ దోహదపడింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం నిర్దిష్ట రంగాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే బాహ్య స్థూల-ఆర్థిక నేపథ్యాన్ని విశ్లేషించాలన్న భారత్ ఆకాంక్ష కూడా ప్రస్ఫుటమైంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని సమస్యలపై మరింత ఆర్థిక సహకార విస్తృతి అవసరాన్ని గుర్తించేందుకు ఈ ద్వైపాక్షిక ఆర్థిక-ద్రవ్య భాగస్వామ్య సమావేశం తోడ్పడింది. అంతేకాకుండా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ‘‘సమకాలీన ఆర్థిక మందగమనం’’ పరిష్కారంపై మార్గదర్శనం చేసింది. దీనికి సంబంధించి చేపట్టాల్సిన ‘‘ద్రవ్య రంగ సంస్కరణల’’ ప్రాముఖ్యం కూడా ఈ చర్చల్లో ముందుకొచ్చింది. ఈ సందర్భంగా జాతీయ బ్యాంకుల విలీనం ప్రణాళిక సహా బ్యాంకులకు పునఃమూలధన కల్పనపైనా చర్చ సాగింది. అలాగే బీమారంగ నియంత్రణతోపాటు ద్రవ్య నియంత్రణ పరిణామాలపై సంబంధిత అధికారవర్గాలు ‘ద్రవ్య నియంత్రణ చర్చ’ సందర్భంగా చర్చించాయి. కాగా, దీనికిముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, స్టీవెన్ మెనూషిన్ ముఖాముఖి సమావేశమై ‘స్థూల-ద్రవ్య చట్రం’ గురించి చర్చించారు.

ర్థిక వ్యవస్థ బలోపేతం కోసం నిర్దిష్ట రంగాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే బాహ్య స్థూల-ఆర్థిక నేపథ్యం అంచనాలకు ద్వైపాక్షిక సమావేశం ఇచ్చిన ప్రాముఖ్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇది వడ్డీ శాతాల్లో వ్యత్యాసాలపై ప్రతిస్పందించే సందిగ్ధ అంశం కావడమే ఇందుకు కారణం. ఈ చర్చలు వాస్తవ- ఆర్థిక రంగాల మధ్య అనుసంధానానికి దారితీసే అవకాశాలూ ఉన్నాయి. ఇక విదేశీ పెట్టుబడుల గతిశీలతకు సంబంధించిన ‘మూలధన ఖాతా’పై ఈ సమావేశంలో దృష్టి సారించడం కూడా సాపేక్షంగా ప్రాముఖ్యంగల అంశమే. భారతదేశంలో ‘ఆర్థిక దౌత్యం’ తీరుపై విశ్లేషణ దృష్ట్యా కూడా ఈ సమావేశం కీలకమైనదే. మరోవైపు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం- RCEPలో చేరడంపైనా భారత్ చర్చల్లో పాల్గొంది. పది ఆసియాన్ సభ్యదేశాలతోపాటు ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, కొరియా, న్యూజిలాండ్ మధ్య తాజా ‘ప్రాంతీయ సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’పై ఈ చర్చలు జరిగాయి. అయితే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు తిరస్కరించింది. ‘‘అస్థిర వాణిజ్య లోటు’’పై భారత్ వెలిబుచ్చిన తీవ్ర ఆందోళనను చర్చల సందర్భంగా పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ ఒప్పందం ఎంతో ‘పరిణామాత్మకం’గా రూపొందేది. కానీ, ఈ అవకాశం లేనందువల్ల RCEPలో భాగస్వామి కారాదన్న భారత్ నిర్ణయం పూర్తిగా సమర్థనీయమైనదే. ఏదేమైనప్పటికీ భారత-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం విషయంలో మాత్రం శ్రీమతి సీతారామన్, మెనూషిన్ బృందాల మధ్య ద్వైపాక్షిక సమావేశాల్లో పరస్పర ప్రయోజనకర పరిణామం ఆవిష్కృతమైంది. ఆ మేరకు ఆర్థిక సహకారంసహా ‘విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేత’, ‘అక్రమార్జన తరలింపు’ను అరికట్టడంపై సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది.

లాగే ఉన్నతస్థాయి బదిలీ ధర ముప్పు అంచనాలకు సంబంధించి దేశాలవారీ నివేదికలను స్వయంచలిత మార్గంలో మార్పిడి చేసుకోవడంపైనా ఢిల్లీ సమావేశం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండు దేశాల నడుమగల పరస్పర ఒప్పంద ప్రక్రియ, ద్వైపాక్షిక ముందస్తు ధర ఒప్పంద సంబంధం ప్రాతిపదికన భారత-అమెరికాల మధ్య ద్వైపాక్షిక పన్ను వివాదాల పరిష్కార ప్రగతిని కూడా మంత్రులు సమీక్షించారు. విదేశీ ఖాతాలకు పన్ను వర్తింపు చట్టంపై అంతర ప్రభుత్వ ఒప్పందానికి అనుగుణంగా ద్రవ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఈ సమావేశంలో మరింత ముందుకు సాగాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా పరస్పర ప్రయోజనకర సమాచార మార్పిడి మాత్రం సున్నిత అంశంగానే మిగిలింది. అయినప్పటికీ భారత-అమెరికా ఆర్థిక, ద్రవ్య భాగస్వామ్య 7వ సమావేశం ముగిశాక విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో  ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటు నిరోధంపై ఏకాభిప్రాయం వెలువడటం హర్షణీయమే.

భారతదేశంలోని రాష్ట్రాలు, పుర-నగరపాలక సంస్థలు మౌలిక సదుపాయాలకు నిధుల కోసం విదేశీ బాండ్లను విడుదల చేసే ధోరణిని ప్రముఖంగా ప్రస్తావించాల్సి ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ‘మసాలా బాండ్’ పేరిట విదేశాల్లో రూపాయి ఆధిక్య బాండ్లను విడుదల చేయడం ఇందుకు ఒక ఉదాహరణ. అలాగే అత్యాధునిక నగరాల నిర్మాణం పథకంలో భాగంగా పుణె పురపాలిక 2017లో పురపాలక బాండ్లను విడుదల చేసింది. ఇక మౌలిక వసతుల కల్పనలో మూలధన వ్యయం పెంపు దిశగా ప్రైవేటు వ్యవస్థాగత పెట్టుబడుల సమీకరణలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ‘జాతీయ మౌలిక వసతుల పెట్టుబడి నిధి’’ని ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత్కు నిరంతర సాంకేతిక తోడ్పాటు ఇవ్వడమేగాక విస్తృత ప్రాతిపదికగల భాగస్వామ్యానికి అమెరికా హామీ ఇచ్చింది.

రచన: డాక్టర్ లేఖ S.చక్రబర్తి, ఎకనమిస్ట్ అండ్ ప్రొఫెసర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఫైనాన్స్ అండ్ పాల‌సీ