స్థిరాస్తి రంగానికి ఉత్తేజం దిశగా ప్రభుత్వ సానుకూల చర్యలు

   ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, సంబంధిత అలజడుల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం ఒడుదొడుకుల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల నడుమ కీలకమైన స్థిరాస్తి రంగం పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి-NDA ప్రభుత్వం నిర్ణయించింది. విస్తృతమైన దేశ ఆర్థిక వ్యవస్థలో గిరాకీని ఉత్తేజితం చేయడానికి సరైన దిశగా తీసుకున్న చర్యగా దీన్ని పరిగణించాలి. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థ విస్తృతిని వృద్ధి పథంలో కొనసాగించే సవాలుకు దీటుగా ప్రభుత్వం స్పందించింది.  తదనుగుణంగా 1600 ప్రాజెక్టుల పరిధిలోని 4లక్షల 58వేల ఇళ్ల పునరుద్ధరణ కోసం రూ.25వేల కోట్ల మూలనిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన లేదా ఆర్థిక అశక్తత చర్యలు ఎదుర్కొంటున్న సంస్థలుసహా ఇతర నిర్మాణ సంస్థలు ఈ 1600 ప్రాజెక్టుల పరిధిలోకి వస్తాయి.

ర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సూచించిన మేరకు దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రాజెక్టులలో ఇళ్లు కొనుగోలు చేసి, నెలవారీ గృహరుణ వాయిదాలు చెల్లించనివారికి కూడా ప్రభుత్వ నిర్ణయంతో కాస్త ఊరట లభిస్తుంది. అర్ధంతరంగా ఆగిపోయిన మధ్యాదాయ-అందుబాటు ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని రెండు నెలల కిందట ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం. అనేకమంది భవన నిర్మాణదారులు అప్పులలో కూరుకుపోవడమేగాక కొత్త అపార్ట్‌మెంట్ల‌ను విక్రయించలేని దుస్థితిలో ఉన్నారు. ఫలితంగా నిధుల లభ్యత సంక్షోభంతో స్థిరాస్థి రంగం తీవ్ర తిరోగమనంలో పడింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ప్రకటించిన పథకం ఈ రంగం పునరుజ్జీవనానికి గణనీయంగా తోడ్పడగలదని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా అటు ఇళ్ల కొనుగోలుదారులకు, ఇటు స్థిరాస్థి వ్యాపారులకు ఇది ఉభయతారకం కాగలదని అభిప్రాయపడుతున్నారు.

ర్థిక వ్యవస్థలో వృద్ధి వేగానికి ఉత్తేజమివ్వడంలో స్థిరాస్తి రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నది అంతర్జాతీయ ఆమోదిత వాస్తవం. ఇక భారతదేశంలో అటు గృహ, ఇటు నిర్మాణ రంగాలతో ముడిపడి ఉన్న స్థిరాస్తి రంగం ఉద్యోగావకాశాల సృష్టిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే మన విశాల ఆర్థిక వ్యవస్థలోగల స్టీలు, సిమెంటుసహా అనేక కీలక రంగాల్లో గిరాకీని ఉత్తేజపరుస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపైనా ప్రత్యక్ష, పరోక్ష, ప్రేరేపిత ప్రభావాలు చూపగలిగే 14 ప్రధాన రంగాలకుగాను భారత నిర్మాణ రంగానిది మూడో స్థానం. అందువల్ల స్థిరాస్తి రంగంలో వృద్ధికి ఊతమిచ్చే చర్య ఏదైనా, అది అంతిమంగా స్థూల దేశీయోత్పత్తి-GDPలో వృద్ధి వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాణ-పరిమాణాల దృష్ట్యా స్థిరాస్తి రంగం 2030 నాటికి లక్ష డాలర్ల మార్కెట్ స్థాయికి చేరగలదని అంచనా. అంతేగాక 2025కల్లా GDPలో 13 శాతం వాటాను సమకూర్చగలదని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా ఆకర్షించగల సామర్థ్యం స్థిరాస్తి రంగానికి ఉంది. మన నిర్మాణ రంగం 2000 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్యకాలంలో 2504 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టడం ఇందుకు నిదర్శనం. సాక్షాత్తూ పారిశ్రామిక విధానాలు-ప్రోత్సాహక శాఖ ఈ వివరాలను ప్రకటించింది. మరోవైపు…

స్థిరాస్తి రంగ పెట్టుబడి ట్రస్టు- REIT పేరిట ఒక వేదిక ఏర్పాటుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI అనుమతి ఇవ్వడం విశేషం. దీనిద్వారా అన్నిరకాల పెట్టుబడిదారులకూ భారత స్థిరాస్తి విపణిలో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ఆ మేరకు రాబోయే ఐదేళ్లలోనే 1965 కోట్ల డాలర్ల పెట్టుబడులకు అవకాశాలుంటాయని అంచనాలు చెబుతున్నాయి. అన్నీ తెలిసిన వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో భారత స్థిరాస్తి రంగ వ్యాపారులు తదనుగుణంగా స్పందిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచీకరణ కోణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వ్యూహాలను మార్చుకుంటూ తాజా సవాళ్లను స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా మన స్థిరాస్తి రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరుగుదలతో పారదర్శకత మెరుగయ్యే వీలు కలిగింది. ఆ మేరకు పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్థిరాస్తి వ్యాపారులు తమ ఖాతాలు, నిర్వహణ వ్యవస్థలలో ప్రమాణాల పునరుద్ధరణపై శ్రద్ధ చూపుతున్నారు. దీనికితోడు వివిధ నగరాల్లో అనేక ప్రాజెక్టులను నిర్వహించాల్సిన అవసరం పెరుగుతోంది. అందుకు తగినట్లుగా ముడి పదార్థాలు, మానవ వనరుల నిర్వహణలో కేంద్రీకృత ప్రక్రియలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్, ప్రాజెక్టుల నిర్వహణ, వాస్తు తదితరాలకు సంబంధించి అత్యంత నిపుణులను నియమించుకుంటున్నారు. ఈ అంశాలన్నిటి దృష్ట్యా ఆర్థిక వ్యవస్థ స్వరూప వికాసంలో గణనీయ పాత్ర పోషిస్తున్న ఈ ప్రధాన రంగాన్ని భారతదేశం విస్మరించజాలదని చెప్పవచ్చు. కాబట్టి… స్థిరాస్తి రంగం పునరుజ్జీవనంపై ప్రభుత్వం తీసుకున్నది సానుకూల, కీలక నిర్ణయమేనని చెప్పడం అవాస్తవం కాబోదు.

రచన: ఆదిత్య రాజ్ దాస్, ఆర్థికాంశాల సీనియర్ పాత్రికేయులు