అమెరికా విదేశాంగ శాఖ నివేదిక‌లో పాకిస్థాన్‌పై ఘాటు విమర్శలు

పాకిస్థాన్‌లో ఉగ్ర‌వాదంపై 2018 సంవ‌త్స‌రానికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఉగ్ర‌వాదంపై పోరాటం దిశ‌గా అరకొర చ‌ర్య‌ల‌కు ప‌రిమితం కావ‌డంపై పాకిస్థాన్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. వివిధ దేశాల్లో ఉగ్ర‌వాదం స్థితిగ‌తుల‌పై అమెరికా కాంగ్రెస్ అంచ‌నాల‌ను విదేశాంగ నివేదిక అధికారికంగా ధ్రువీక‌రిస్తుంది. ఈ మేర‌కు స‌ద‌రు నివేదిక‌లో పాకిస్థాన్‌పై అనేక విధాలుగా విరుచుకుప‌డింది. ముఖ్యంగా దేశంలో ‘‘ఉగ్ర‌వాదాన్ని రెచ్చ‌గొట్ట‌డం, నియామ‌కాలు-శిక్ష‌ణ‌’’ల‌కు సంబంధించి ల‌ష్క‌రే తాయిబా-LeT, జైషే మొహ‌మ్మ‌ద్-JeM వంటి ఉగ్ర సంస్థ‌ల కార్య‌క‌లాపాల నియంత్ర‌ణ‌లో పాకిస్థాన్ విఫ‌ల‌మైంద‌ని పేర్కొంది. LeT ముసుగు సంస్థ‌లుగా పేరుపొందిన సంస్థ‌ల‌తో బాహాటంగా సంబంధాలున్న‌వారిని 2018 జూలైనాటి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో పోటీకి పాకిస్థాన్ ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డాన్ని నివేదిక త‌ప్పుబ‌ట్టింది. క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదుల‌ను ప్ర‌ధాన జాతీయ స్ర‌వంతిలోకి తేవ‌డంద్వారా ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు రాజ‌కీయాధికారం అప్ప‌గించేలా బాటలు వేయ‌డానికే ఈ ఎత్తుగ‌డ వేసింద‌ని ఆరోపించింది. అదృష్ట‌వ‌శాత్తూ స‌ద‌రు ఎత్తుగ‌డ‌ను పాకిస్థాన్ ఎన్నిక‌ల సంఘం అడ్డుకున్న‌ద‌ని పేర్కొంది.

ఇక పాకిస్థాన్‌లో అక్ర‌మార్జ‌న చ‌లామ‌ణీ, ఉగ్ర‌వాదానికి నిధులు స‌మ‌కూర్చ‌డం త‌దిత‌రాల‌ను నేరంగా ప‌రిగ‌ణించే బ‌దులు వాటి నియంత్రణను అర‌కొర చ‌ర్య‌ల‌కు పరిమితం చేసింద‌ని నివేదిక తెలిపింది. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో రాజ‌కీయ సామ‌రస్య సాధ‌న దిశ‌గా ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు పాకిస్థాన్ మ‌ద్ద‌తు ప‌లికింద‌ని గుర్తుచేసింది. అయిన‌ప్ప‌టికీ, త‌మ భూభాగంనుంచి దుశ్చర్యలు కొనసాగిస్తున్న తాలిబ‌న్లను, హ‌క్కానీ నెట్‌వ‌ర్క్ ఉగ్రవాదులను అదుపు చేయ‌లేద‌ని తెలిపింది. అంతేగాక ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని అమెరికా, ఆప్ఘ‌న్ బ‌ల‌గాలపై అవి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నా నిలువ‌రించ‌లేద‌ని పేర్కొంది.

ఆర్థిక కార్యాచరణపై ప్రత్యేక బృందం-FATF నిర్దేశిత నియమావళికి సంబంధించి- ఐక్య‌రాజ్య స‌మితి నిషేధిత LeT, త‌దిత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌లు, వాటికి అనుబంధంగాగ‌ల‌ సంస్థ‌లు, వ్య‌క్తులపై విధించిన ఆంక్ష‌ల‌ను స‌మ‌రీతిన‌ అమ‌లు చేయ‌డంలో పాక్ అధికార‌వ‌ర్గాలు విఫ‌ల‌మైన‌ట్లు నివేదిక వెల్ల‌డించింది. దీంతో ఆయా ఉగ్ర‌వాద సంస్థ‌లు య‌థేచ్ఛ‌గా ఆర్థిక వ‌న‌రుల‌ను వాడుకోవ‌డ‌మేగాక నిధులు స‌మీక‌రిస్తూనే ఉన్నాయ‌ని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోయిన సంవత్సరం జూన్ నెల‌లో పాకిస్థాన్‌ను ‘‘హెచ్చ‌రించ‌ద‌గిన దేశాల జాబితా’’లో చేర్చిన FATF ఈ ఏడాది తాజా స‌ద‌స్సు సంద‌ర్భంగా ఆ ముద్ర‌ను తొల‌గించేందుకు అంగీక‌రించ‌లేద‌ని నివేదిక వివ‌రించింది. FATF నిర్దేశించిన 27 అంశాల‌కుగాను కేవ‌లం ఐదింటిలో మాత్ర‌మే పాకిస్థాన్ చ‌ర్య‌లు తీసుకున్నందున ఈ ముద్రనుంచి ఊర‌ట‌నివ్వ‌డం కుద‌ర‌దంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింద‌ని తెలిపింది. అంతేగాక దేశవ్యాప్తంగా అనుమతిలేని ద్రవ్య బదిలీ కొనసాగిందని, ఉగ్ర‌వాదుల‌కు ఆర్థిక సాయం చేస్తున్న‌ సీమాంతర ప్రదేశాల్లోని శ‌క్తుల విజృంభణకు ఇది ఊత‌మిచ్చింద‌ని నివేదిక వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి గ‌డువులోగా మిగిలిన అంశాల్లోనూ ప్ర‌భావ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని FATFకు పాకిస్థాన్ హామీ ఇచ్చింద‌ని గుర్తుచేసింది.

ఉగ్ర‌వాదంపై పోరుకు సంబంధించి 2015లో పాకిస్థాన్ జాతీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించ‌డాన్ని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక ప్ర‌స్తావించింది. ఇందులో భాగంగా *బ్యాంకులద్వారా అనుమానాస్ప‌ద న‌గ‌దు లావాదేవీల‌ను నివేద‌న‌, ఉగ్ర‌వాద నేరాల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధింపు, ముంద‌స్తు నిర్బంధం, ప్ర‌త్యేక ఉగ్ర‌వాద నిరోధ‌క కోర్టుల ఏర్పాటు* వంటివాటిపై చ‌ట్టాలు రూపొందించిన‌ట్లు తెలిపింది. కానీ, ఇవ‌న్నీ కాగితాల‌కు ప‌రిమితం కావ‌డ‌మే త‌ప్ప చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని నివేదిక ఎండ‌గ‌ట్టింది. ఉగ్ర‌వాద నిరోధానికి పాకిస్థాన్ 2018లో కొన్ని చ‌ర్య‌లు తీసుకున్నప్ప‌టికీ ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌డంలేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

లష్క‌రే, జైషే ఉగ్ర‌వాద సంస్థ‌ల నిరోధానికి త‌గినంత కృషి చేయ‌లేదంటూ అమెరికా విదేశాంగ శాఖ నివేదిక తమపై కటువైన విమర్శలు చేయ‌డంమీద పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఉగ్ర‌వాదంపై పోరులో గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాలుగా తాము చేసిన కృషిని, క్షేత్ర‌స్థాయి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను స‌ద‌రు నివేదిక పూర్తిగా విస్మ‌రించింద‌ని పేర్కొంది. తాము తీసుకున్న చ‌ర్య‌లవ‌ల్ల మాత్ర‌మే ఈ ప్రాంతంలో అల్‌ఖైదా ఉగ్ర‌వాద సంస్థ నిర్మూల‌న సాధ్య‌మైంద‌ని, త‌ద్వారా ప్ర‌పంచం సుర‌క్షితం కాగ‌లిగింద‌ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్ర‌క‌ట‌న పేర్కొంది. అయితే, అమెరికా ప్ర‌త్యేక బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టేదాకా అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు అబొట్టాబాద్ సైనిక ఆవాసాల్లో ఐదేళ్ల సుదీర్ఘ కాలంపాటు ఆశ్ర‌య‌మివ్వ‌డాన్ని గుర్తుచేసుకునేందుకు పాకిస్థాన్ ఇచ్చ‌గించ‌డం లేదు. ఉగ్ర‌వాద నిర్మూల‌న‌పై పాకిస్థాన్‌కు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే- లాడెన్ జాడ తెలుసుకోవ‌డంలో తోడ్ప‌డిన డాక్ట‌ర్ ష‌కీల్ అఫ్రిదీని దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్క‌రించి ఉండేది. దీనికి బ‌దులుగా ఆ డాక్ట‌ర్ గ‌డ‌చిని తొమ్మిదేళ్లుగా పాకిస్థాన్ జైల్లో మ‌గ్గుతుండ‌టం ఈ సంద‌ర్భంగా గ‌మ‌నార్హం.

ఉగ్ర‌వాదంపై త‌మ పోరాటం గురించి పాకిస్థాన్ ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే ఉన్నా ఉగ్ర‌వాదుల‌ను ‘మంచి-చెడు’ అంటూ వ‌ర్గీక‌రించ‌డంద్వారా ద్వంద్వ ప్ర‌మాణాలు పాటిస్తున్న‌ద‌న్న వాస్త‌వం ప్ర‌పంచం మొత్తానికీ తెలుసు. ‘మంచి’ ఉగ్ర‌వాదులను త‌మ దేశానికి సంప‌ద‌గానూ, ఉగ్ర‌వాదాన్ని త‌మ విదేశాంగ విధానంలో ఒక భాగంగానూ పాక్ కొన‌సాగిస్తూనే ఉంది. అయితే, అన్నిర‌కాల ఉగ్ర‌వాదంపైనా విస్ప‌ష్ట, పార‌ద‌ర్శక రీతిలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోకపోతే ఉగ్ర‌వాదంపై పోరులో పాకిస్థాన్ త‌న చిత్త‌శుద్ధిని ప్ర‌పంచం ముందు నిరూపించుకోవ‌డం అసాధ్యమే.

రచన: అశోక్ హండూ, రాజ‌కీయాంశాల‌ వ్యాఖ్యాత‌