ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఉప‌సంహ‌ర‌ణ ఆందోళ‌న‌క‌రం

చరిత్రాత్మ‌క ప్యారిస్ వాతావ‌ర‌ణ మార్పు ఒప్పందం-2015 లేదా ‘కాప్‌21’ నుంచి వైదొల‌గాల‌న్న అమెరికా నిర్ణ‌యం- ఆ దేశానికేగాక ప్ర‌పంచం మొత్తానికీ తీవ్ర ఆందోళ‌న క‌లిగించే అంశం. ట్రంప్ యంత్రాంగం గ‌త సోమ‌వారం నాడు ఐక్య‌రాజ్య స‌మితికి అధికారికంగా ఈ నిర్ణ‌యాన్ని తెలియ‌జేసింది. దీంతో ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభంకాగా, ఇది పూర్త‌య్యేందుకు ఏడాది కాలం ప‌డుతుంది. స్పెయిన్ రాజ‌ధాని మాడ్రిడ్‌లో డిసెంబ‌రు 2 నుంచి 13వ తేదీదాకా వాతావ‌ర‌ణ మార్పుపై ఐక్య‌రాజ్య స‌మితి 25వ స‌ద‌స్సు- ‘కాప్‌25’ జ‌ర‌గ‌నుంది. అయితే, దీనికి నెల ముందుగా అమెరికా త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ఈ స‌ద‌స్సును చిలీ రాజ‌ధాని శాంటియాగోలో నిర్వ‌హించాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఆ దేశంలో పౌర ఉద్యమం కార‌ణంగా వేదిక మాడ్రిడ్‌కు మారింది.

ప్యారిస్ ఒప్పందంపై 2015లో దాదాపు 200 దేశాలు సంత‌కం చేశాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త ప్ర‌మాద స్థాయికి వెళ్ల‌కుండా హ‌రిత‌వాయు ఉద్గారాలను త‌గ్గించ‌డం ఈ ఒప్పందం ల‌క్ష్యం. ఆ మేర‌కు అంత‌ర్జాతీయంగా ఉష్ణోగ్ర‌త స‌గ‌టు పెరుగుద‌లను 2 డిగ్రీల సెల్సియ‌స్‌క‌న్నా త‌క్కువ‌గా ఉంచాల‌న్న‌ది దీని ధ్యేయం. అయితే, ప్ర‌పంచ దేశాలు  నిర్దేశించుకున్న ఈ ల‌క్ష్యానికి అమెరికా నిర్ణ‌యం తీవ్ర విఘాతం క‌లిగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ఒప్పందం నుంచి వైదొల‌గిన దేశం అమెరికా ఒక్క‌టే కాగా, ప్ర‌పంచంలోని అత్య‌ధిక హ‌రిత‌వాయు ఉద్గార దేశాల్లో చైనా త‌ర్వాత అమెరికాది రెండో స్థానం కావడం గ‌మ‌నార్హం. ఒప్పందంపై సంత‌కం చేసినప్పుడు 2025నాటికి జాతీయ హ‌రిత‌వాయు ఉద్గారాల‌ను 26 నుంచి 28 శాతం మేర త‌గ్గిస్తామ‌ని అమెరికా హామీ ఇచ్చింది. కానీ, అమెరికా నిష్క్ర‌మ‌ణ‌తో 97 శాతంగా ఉండాల్సిన అంతర్జాతీయ హ‌రిత‌వాయు ఉద్గారాల త‌గ్గింపు ల‌క్ష్యం ఇప్పుడు 80 శాతానికి ప‌రిమితం కానుంది. వాతావరణ మార్పుపై కార్యాచరణకు అంతర్జాతీయంగా నిధుల సమీకరణలో ప్రధాన పాత్ర అమెరికాదే. కానీ, ఒప్పందం నుంచి అది నిష్క్ర‌మించడంతో ల‌క్ష్య సాధ‌న‌పై ఆర్థిక వ‌న‌రుల కొర‌త తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికితోడు వాతావ‌ర‌ణ మార్పుపై కార్యాచ‌ర‌ణ‌లో వ‌ర్ధ‌మాన‌ దేశాల‌కు నిధులందించే ప్ర‌ధాన వ్య‌వ‌స్థ అయిన ‘‘హ‌రిత వాతావ‌ర‌ణ నిధి’’-GCFకు త‌న వాటా విరాళాన్ని కూడా ట్రంప్ ప్ర‌భుత్వం నిలిపివేసింది.

ఈ పరిస్థితుల్లో ప్రపంచం దృష్టి భార‌త్‌, చైనాస‌హా హ‌రిత‌వాయు ఉద్గారాల పెరుగుద‌ల అధికంగాగ‌ల దేశాల‌వైపు మ‌ళ్లుతుంది. ఉద్గారాల‌ను త‌గ్గించేందుకు ఈ దేశాలు మ‌రింత‌గా కృషి చేస్తాయ‌న్న అంచ‌నాలు స‌హ‌జంగానే పెరుగుతాయి. ఆ మేర‌కు దేశీయంగా ఉద్గారాల త‌గ్గింపుతోపాటు వ‌ర్ధ‌మాన దేశాల‌కు నిధులు, సాంకేతిక ప‌రిజ్ఞానం ల‌భ్య‌త‌లో వ్య‌త్యాసాన్ని అవి పూరించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్యారిస్ ఒప్పందం సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో భార‌త్ బ‌లంగా ముందుకు సాగుతోంది. ఆ మేర‌కు ‘కాప్‌21’లో ఇచ్చిన హామీల‌ను 2030 నాటికి నెర‌వేర్చాల్సి ఉండ‌గా-మ‌రో ఏడాది లేదా ఏడాదిన్న‌రలోగానే అత్య‌ధిక ల‌క్ష్యాల‌ను సాధించ‌గ‌ల‌మ‌ని భార‌త్ ధీమా వ్య‌క్తం చేసింది. కాగా- ‘కాప్‌21’ సంద‌ర్భంగా భార‌త్ నాలుగు అంశాల్లో త‌న సంకల్ప‌శుద్ధిని ప్ర‌క‌టించింది. ఆ మేరకు నిర్దేశించుకున్న జాతీయ క‌ర్త‌వ్యాల్లో రెండింటిని నెర‌వేర్చే దిశగా ముందంజ‌ వేస్తున్న దేశాల జాబితాలో భార‌త్ కూడా ఒక‌టి. శిలాజేత‌ర ఇంధ‌న స్థాపిత సామ‌ర్థ్యాన్ని 40 శాతానికి చేర్చ‌డం ఈ రెండు క‌ర్త‌వ్యాల్లో ఒక‌టి కాగా, 2005తో పోలిస్తే 2030నాటికి 33 నుంచి 35 శాతందాకా ఉద్గారాల‌ను త‌గ్గించాల‌న్న‌ది రెండోది. ఈ నేప‌థ్యంలో భార‌త్ ఈ రెండు ల‌క్ష్యాల‌ను త్వ‌ర‌గా అధిగ‌మించి 2030క‌న్నా ముందే మిగిలిన‌వాటిని సాధించే వీలుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల క‌ల్ప‌న‌లో… ముఖ్యంగా సౌర‌శ‌క్తి సామర్థ్యం పెంపులో భార‌త్ అత్యంత చురుగ్గా దూసుకెళ్తోంది. సౌర‌శ‌క్తి రంగానికి విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌గ‌ల విస్తృత సామ‌ర్థ్యం ఉన్నందున ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మానికి మ‌రింత ఉత్తేజం కూడా ల‌భిస్తుంది.

వాతావ‌ర‌ణ మార్పు స‌వాలును ఎదుర్కొన‌డంలో చేయాల్సింది చాలా ఉంది. అయితే, 2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త పెరుగుద‌ల ప‌రిమితికి లోబ‌డిన‌ ఉద్గారాల నియంత్ర‌ణకు క‌ట్టుబ‌డిన కొద్ది దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టిగా ఉంది. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్ర‌మ‌ణ మన దేశంపై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూప‌కపోయినా, భ‌విష్య‌త్ వాతావ‌ర‌ణ విధానాల‌మీద కాస్త ప్ర‌తికూల‌త క‌నిపించ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ మార్పుల‌వల్ల హానికి గురయ్యే దేశంగా భారత్ మునుముందు పెనుసవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దేశంలో చేప‌ట్టే ప్ర‌గ‌తి ప‌థ‌కాల‌పై ఇది ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం లేక‌పోలేదు. పున‌రుత్పాద‌క ఇంధ‌నం విష‌యంలో ప్ర‌పంచానికి మార్గద‌ర్శిగా ఆవిర్భ‌వించిన మ‌న దేశం- శిలాజ ఇంధ‌నాల‌తో పోలిస్తే వీటిమీద‌నే ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెడుతోంది. క‌ర్బ‌న‌, ఇత‌ర హ‌రిత‌వాయు ఉద్గారాల‌ను వీలైనంత త‌క్కువ స్థాయికి ప‌రిమితంచేసే దిశ‌గా దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల‌ను 2020నాటికి రూపొందిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. సుస్థిర అట‌వీ నిర్వ‌హ‌ణ‌తోనూ వాతావ‌ర‌ణ మార్పుల‌నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని మ‌న దేశం ప్ర‌తిపాదించింది. ఆ మేర‌కు క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు, శాస్త్రీయ విధానాల‌తో దేశ భౌగోళిక విస్తీర్ణంలో క‌నీసం మూడోవంతు అట‌వీకరణను సాధించాలని 2018నాటి జాతీయ అట‌వీ విధాన ముసాయిదాలో నిర్ణయించినట్లు తెలిపింది. వాతావరణ మార్పు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా ఫ్రాన్స్‌తో సంయుక్తంగా అంతర్జాతీయ సౌర కూటమి-ISA ఏర్పాటులో చొర‌వ చూపిన భారత్- అలాంటి నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లకు నేతృత్వం వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. మొత్తంమీద ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ సాధనలో భార‌త్ చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉన్నా- ప‌రిశుభ్ర ఇంధ‌న భ‌విష్య‌త్తువైపు స్థిరంగా ముంద‌డుగు వేస్తుండటం ముదావహం.

రచన: కె.వి.వెంక‌ట సుబ్ర‌మ‌ణియ‌న్‌, సీనియ‌ర్ పాత్రికేయులు