క‌ర్తార్‌పూర్ ప్రాముఖ్యం

భారతదేశ విభజనవల్ల తమకు దూరమైన పవిత్ర స్థలాలను స్వేచ్ఛగా సందర్శించే అవకాశం లభించాలంటూ సిక్కులు నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. అలాంటి పుణ్య క్షేత్రాల్లో ‘‘క‌ర్తార్‌పూర్ సాహిబ్’’ అత్యంత పునీత‌మైన‌ది. ‘రావి’ న‌దీతీరంలోగల ఈ మందిరంలోనే గురునాన‌క్ త‌న జీవితంలో చివ‌రి 18 సంవ‌త్స‌రాలు గ‌డిపి, కాల‌ధ‌ర్మం చేశారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం 4 కిలోమీట‌ర్ల దూరంలోగ‌ల ఈ ప్ర‌దేశం భార‌త భూభాగం నుంచి క‌నిపిస్తూంటుంది. ఈ మార్గాన్ని తెరిస్తే వేలాది సిక్కు యాత్రికుల‌కు ఆ ప‌విత్ర ప్ర‌దేశం ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. త‌ద్వారా ల‌క్ష‌లాది భ‌క్తులకు భావోద్వేగ‌ప‌రంగా, అధ్యాత్మికంగా ఎంతో ఊర‌ట ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ర్తార్‌పూర్ మార్గంలో భార‌త్‌వైపున గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నాన‌క్ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ స‌మీకృత త‌నిఖీ కేంద్రాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక‌పై క‌ర్తార్‌పూర్‌లోని ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారాను యాత్రికులు సుల‌భంగా ద‌ర్శించుకోగ‌ల‌ర‌ని ఈ సంద‌ర్భంగా ఆయన అన్నారు. అటుపైన ద‌ర్బారా సాహిబ్ సంద‌ర్శ‌న‌కు భార‌త యాత్రికుల‌ తొలి బృందం బయల్దేరింది. మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ నాయ‌క‌త్వంలో కేంద్ర మంత్రులు హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్‌, హ‌ర్‌దీప్ సింగ్ పూరి త‌దిత‌రుల‌తో కూడిన ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధి బృందం కూడా ఇందులో భాగంగా ఉంది.

గురునానక్ సద్బోధల పున‌రుద్ఘాట‌న‌, పునఃశోధ‌న‌ల‌ను ప్ర‌తిబింబించే సంద‌ర్భం ఆయ‌న 550వ జ‌యంతి వేడుక‌లే. గురు బోధ‌న‌ల‌లోని అత్యంత ముఖ్య‌మైన అంశాలలో అనేకం క‌ర్తార్‌పూర్‌లో ఆయ‌న జీవించిన సందర్భంగా ఉద్భ‌వించిన‌వే. అంత‌కుముందు ఆయ‌న రెండు ద‌శాబ్దాల‌పాటు నిర్విరామ యాత్రికుడుగా కాలం గ‌డిపి చివ‌ర‌కు క‌ర్తార్‌పూర్‌లో స్థిర‌ప‌డ్డారు. ఈ సుదీర్ఘ యాత్ర స‌మ‌యంలోనే మాన‌వాళిలో స‌హానుభూతి, స‌మానత్వాల‌తోపాటు స‌త్యం-స‌త్య జీవ‌నం, సృష్టి స‌హ‌జ స్వ‌భావం, భ‌క్తి త‌దిత‌రాల‌తో నిండిన త‌న సందేశాన్ని వ్యాపింప‌జేశారు. అనేక విశ్వాసాల‌కు చెందిన విజ్ఞానుల‌తో ఆయ‌న విస్తృతంగా చ‌ర్చించారు. అజ్ఞాన తిమిరాన్ని తొల‌గిస్తూ స‌ర్వ‌సంగ‌ ప‌రిత్యాగంస‌హా మూఢ విశ్వాసాలన్నింటినీ తిర‌స్కరించారు. ఆ విధంగా త‌న అధ్యాత్మిక సందేశానికి క‌ర్తార్‌పూర్‌లో ఆచ‌ర‌ణాత్మ‌క రూప‌మిచ్చారు గురునాన‌క్‌. అక్క‌డ గృహ‌స్థ జీవ‌నం గ‌డుపుతూ రైతుగా కొన‌సాగారు. ఆయ‌న చుట్టూ అనుచ‌ర‌వ‌ర్గం వేగంగా పెరిగింది. ‘హిందూ-ముస్లిం, ధ‌నిక-పేద‌, ప‌కీర్-వ్యాపారి’ అనే తేడాలేవీ లేకుండా ఆయ‌న‌ను త‌మ మార్గ‌ద‌ర్శ‌కుడుగా అంగీక‌రించారు. అయితే, ఇదొక స‌న్యాస‌దీక్ష స్వీక‌రించే మ‌ఠంలా కాకుండా వ్యాపారులు, రైతులు, హ‌స్త‌క‌ళాకారుల వంటి స‌క‌ల బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేవారి స‌మూహంగా రూపొందింది. ప్ర‌పంచాన్ని ప‌విత్ర ఉద్దేశానికి ప్ర‌తిబింబంగా ప‌రిగ‌ణిస్తూ ప్రాపంచిక దృక్ప‌థం ప్ర‌ధానమైన‌దిగా ఆయ‌న సందేశం రూపొందింది. మ‌నిషి జీవనం ఈ వాస్త‌విక‌త న‌డుమ… మాలిన్యాల‌కు దూరంగా సాగుతూ… మాన‌వాళి వేద‌న‌ల నిర్మూల‌న‌కు చేయ‌గ‌లిగింది చేయాల‌ని అది ప్ర‌బోధిస్తుంది. మూఢాచారాలు, స్వీయ ప‌రిత్యాగం వంటివాటిద్వారా వెల్ల‌డ‌య్యే పూర్తి భ‌క్తిభావాన్ని సార‌హీన‌మైన‌దిగా ప‌రిగ‌ణిస్తూ, ఆచ‌ర‌ణాత్మ‌క విలువ‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చేదిగా ఉండాల‌ని స్ప‌ష్టం చేస్తుంది. ఈ బోధ‌నను స‌మాజానికి స‌ర‌ళంగా వివ‌రిస్తూ- ‘‘కిర‌త్‌ క‌రో- ప‌నిచేయండి, నామ్ జ‌పో- భ‌గ‌వ‌ధ్యానం చేయండి, వంద్ ఛాకో- శ్ర‌మ ఫ‌లాల‌ను పంచుకోండి’’ అని గురునాన‌క్ సందేశ‌మిచ్చారు.

గురునాన‌క్ కాలంనాటి అనేక ముఖ్య‌మైన సంప్ర‌దాయాల‌ను కర్తార్‌పూర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. వాటిలో ‘‘ధ‌ర్మ‌శాల్‌, సంగ‌త్‌, పంగ‌త్’’ వంటివాటితో ముడిప‌డిన‌వి చాలా ఉన్నాయి. ధ‌ర్మ‌శాల్ అంటే- సృష్టిక‌ర్త‌ను కీర్తిస్తూ గురునాన‌క్ ఆల‌పించే కీర్త‌న‌ల‌ను వినేందుకు ప్ర‌జానీకం గుమికూడే ప్రార్థ‌న ప్ర‌దేశం. ప్ర‌జ‌లు ఈ కీర్త‌ల‌ను దైవ ప్ర‌తినిధి అయిన గురువుద్వారా సంక్ర‌మించిన ప‌విత్ర జ్ఞానంగా భావించేవారు. అర్చ‌క‌వ‌ర్గాల స్వార్థ‌పూరిత ప్ర‌భావానికి దూరంగా, గృహ‌స్థుల‌లో సిక్కుమ‌త పున‌రుద్ధ‌ర‌ణ‌కు కీల‌క‌మైన రూపంలో ధ‌ర్మ‌శాల్ అనే ప‌దం కాల‌క్ర‌మంలో ‘గురుద్వారా’గా రూపాంతరం చెందింది.

కీర్తనా గానానికి హాజరయ్యే శ్రోతల సమూహమే ‘సంగత్’ కాగా- స‌ర్వ‌మాన‌వ సౌభాత్ర భావ‌న‌ను ప్రోది చేయ‌డం కోసం దీన్నొక సామాజిక కార్య‌క్ర‌మంగానూ నిర్వ‌హిస్తారు. స‌మాన‌త్వం, సోద‌ర‌భావం ప్రాతిప‌దిక‌న కార్యాచ‌ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే వేదిక‌గానూ దీన్ని ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఆ మేర‌కు సంగ‌త్ అన్న‌ది కుల‌మ‌తాల వ్య‌త్యాసాల‌కు అతీతంగా, వ‌ర్గ‌భేదాల‌తో నిమిత్తం లేకుండా ప్ర‌జానీకాన్ని ఒకేపోతతో ఏకం చేసే కొలిమిగా మారింది. ఇదేవిధంగా గురునాన‌క్ సందేశ పున‌రుద్ఘాట‌నలో భాగంగానే ‘పంగ‌త్‌’ సంప్ర‌దాయం కూడా ఉద్భ‌వించింది. పంగ‌త్ అంటే- పంక్తి అని అర్థం. ఆ మేర‌కు సామూహిక వంట‌శాల- ‘లంగ‌ర్‌’లో త‌యారుచేసిన ఆహారాన్ని ధ‌నిక‌-పేద‌, కుల‌-మ‌త‌, సామాజిక హోదాల‌తో నిమిత్తం లేకుండా ఒకే పంక్తిలో కూర్చుని భుజిస్తారు. లంగ‌ర్ అన్న‌ది కూడా అధ్యాత్మిక లేదా స్వ‌చ్ఛంద సేవ రూపంతో కూడిన‌ది కాగా, సిక్కు స‌మాజంలో భాగ‌మైన దీన్ని గురించి నేడు ప్ర‌పంచం మొత్తానికీ తెలుసు. ఈ నేపథ్యంలో క‌ర్తార్‌పూర్ మార్గం ప్రారంభంతో మాన‌వ స‌మాన‌త్వం, క‌రుణ‌, దైవ‌త్వంలో ఏక‌త్వంవంటి స‌ర్వ‌కాలాల‌కూ వ‌ర్తించే గురునాన‌క్ బోధ‌న‌ల‌కు పున‌రంకితమయ్యే సువ‌ర్ణావ‌కాశం మనకు ల‌భించింది.

రచన: న‌వ్‌తేజ్ స‌ర్ణా, అమెరికాలో భార‌త పూర్వ రాయ‌బారి; ‘ది బుక్ ఆఫ్ నాన‌క్‌’ ర‌చ‌యిత‌