రాజ్య సభ 250 వ సెషన్

భారత పార్లమెంట్ ఎగువ సభ, రాజ్య సభ మరో మెయిలు రాయిని దాటింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో, రాజ్య సభ 250 సమావేశాలు  ప్రారంభమయ్యాయి. ఇదొక చారిత్రక సందర్భం.భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో రాజ్య సభ పోషించిన ప్రధాన భూమికను గుర్తు చేసుకోవలసిన సమయం ఇది. పెద్దల సభగా ప్రసిద్ధి చెందిన రాజ్య సభ, 1952లో ప్రారంభమైన నాటి నుంచి, దేశ ప్రయోజనాల పరిరక్షణలో సందర్భోచితంగా సముచిత పాత్రను పోషించింది. రాజ్య సభ 1952 లో హిందూ వివాహ, విడాకుల చట్టం మొదలు ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2019ని ఆమోదించడం వరకు, అక్కడి నుంచి 2019లో జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్తీకరణ బిల్లు ఆమోదించడం వరకు  అనేక సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్ర పై చెరగని ముద్రను వేసింది. 

ఉపరాష్ట్ర పతి, రాజ్య సభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య  నాయుడు అన్నట్లుగా, ఎగువ సభ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంది. కాలానుగుణంగా దేశం అవసరాలను తీర్చడంలో పెద్దల సభ ప్రముఖ పాత్రను పోషించింది. ‘అయితే,ఇంకా ప్రయాణించవలసిన దూరం చాలానే ఉంది. సభ పని తీరు విషయంలో  కోల్పోయిన కాలాన్ని, అవకాశాలను భర్తీ చేసే విధంగా, రాజ్య సభ పూర్తి సామర్ధ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇంకా ఎన్నో మైళ్ళు ప్రయాణించ వలసి ఉంది” అని ఉపరాష్ట్రపతి చెప్పిన మాట అక్షర సత్యం. 

రాజ్య సభ తొలి సమావేశాలు  1952 మే 13న ప్రారంభభామయ్యాయి. ఆరోజు నుంచి 2019 ఆగష్టు 7 న ముగిసిన 249 వ సమావేశం వరకు ఎగువ సభ మొత్తం 5,466 రోజులు సమావేసమైంది. ఈ కాలంలో, మొత్తం 3 వేల 817 బిల్లులను పెద్దల సభ పాస్ చేసింది. ఇందులో 108 రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. రాజ్య సభ 67 సంవత్సరాల చరిత్రలో 2 వేల 282 మంది సభ సభ్యులుగా సేవలు అందించారు. అందులో 208 మహిళలతో పాటుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 137 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఈ సుదీర్గ ప్రయాణంలో పార్లమెంట్ ఎగువ సభ అర్థవంతమైన ప్రయణానికి ఇదొక నిదర్శనం.  

ఎగువ సభను  ఒక నిరతంతర సజీవ నదీ ప్రవాహంతో పోల్చవచ్చును. దిగువ సభ, లోక్ సభను ఐదేళ్లకు ఒకసారి లేదా అంతకంటే ముందు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి రద్దుచేస్తారు. కానీ, ఎగువ సభ చిరంజీవి, నిరంతర నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం కొనసాగుతున్న 250 వ  సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన విధంగా రాజ్య సభ భారతీయ ‘భినత్వాని’కి ప్రతీక. దేశ సమాఖ్య స్వరూపానికి ప్రతిబింబం. దేశ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా, దేశ ఆర్థిక, సామాజిక పరివర్తన ప్రక్రియలోనూ ఎగువ సభ అంతర్భాగంగా నిలుస్తుంది. ఆరు దశాబ్దాలకు పైగా రాజ్య సభ, దేశ నిర్మాణంలో తన వంతు పాత్రను పోషించింది. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత, అవిద్య, అనారోగ్యం, వ్యాధులు, నిరుద్యోగం, ఉగ్రవాదం వంటి అనేక సమస్యలపై  పోరాటం, సామాజిక, రాజకీయ ఆర్థిక సమస్యలు పరిష్కారానికి జరిగిన కృషి ఇలా సమస్య ఏదైనా అన్ని విషయాల్లో రాజ్య సభ రాజీలేని పోరాటం చేసింది. అలాగే, వాతావరణ మార్పులు, పెరిగి పోతున్న వాతావరణ కాలుష్యం వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో పెద్దల సభ పోషించిన పెద్ద పాత్రను తక్కువగా అంచనా వేయలేము. 

ఇటీవల కాలంలో, వస్తు సేవల పన్ను, ముమ్మారు తలాక్, ఉన్నత కులాలలోని ఆర్థికంగా వెనక బడిన వారికి  విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజేర్వేషన్ కలిపించేందుకు ఉద్దేశించిన బిల్లు, ఆర్టికల్ 370 వంటి అనేక  కీలక బిల్లులకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా, ఆర్టికల్ 370 విషయంగా ప్రధాన మంత్రి రాజ్య సభలో చేసిన ప్రసంగం చాలా విలువైన ప్రసంగంగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రధానమంత్రి తమ ప్రసంగంలో, జమ్మూ కశ్మీర్’ కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370 బిల్లును,రాజ్యసభలో, సభ ప్రప్రధమ  సభానాయకుకు ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ ప్రవేశ పెట్టారు. దశాబ్దాల తర్వాత వివాదాస్పద ఆర్టికల్ అదే రాజ్య సభలో రద్ధయిందని ప్రధాన మంత్రి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేశారు. 

రాజ్య సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మరో విషయం, అనేక రంగాల్లో నిష్టాతులైన ఎందరో మహాను భావులు ఎగువ సభ సభ్యులుగా దేశానికి సేవలు అందించారు. అలాంటి ప్రముఖులలో ప్రప్రధమంగా పేర్కొన దగిన వారిలో, రాజ్యాంగ నిర్మాత డాక్టర్. BR అంబేద్కర్ మొదటి వరసలో నిలుస్తారు. ఆయన రెండు పర్యాలాలు రాజ్య సభ సభ్యునిగా సేవలు అందించారు.ఇదే విషయాన్ని ప్రధానమంత్రి తమ ప్రసంగంలోనూ ప్రస్తావించారు. కళలు, క్రీడలు, శాస్త్ర,సాంకేతిక విజ్ఞానం,వంటి అనేక రంగాలకు చెందిన విశేష వ్యక్తులు రాజ్య సభ సభ్యులుగా దేశ సేవలో భాగస్వాములు అయిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. అలాంటి  ప్రముఖుల వలన కీలక అంశాలపై విలువైన చర్చలు జరగడం మాత్రమే కాదు, వారు సభలో ఉండడం వలన సభా కార్యక్రమాలు సజీవంగా, ఉత్తేజభరితంగా సాగాయి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

 ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,2003లో రాజ్య సభ 200 సమావేశాల సందర్భంగా, “ఎవరూ కూడా పార్లమెంట్ రెండవ సభను అప్రధాన సభగా పేర్కొనన రాదు, లాంటి తప్పు చేయరాదు’ అని   మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి, చేసిన సూచనను ప్రస్తావించారు. నిజం శాస్త్ర వేత్తలు, డాక్టర్లు, కళాకారులు, విశ్వ విద్యాలయాల ఉపాధ్యాయులు, రాజ్య సభ సభ్యులుగా దేశ ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రణవిల్ల చేయడమే కాదు, జాతీయ ప్రాధాన్యతలు, ప్రాధమ్యాలను నిర్దేశించడంలో కీలక  భూమికను పోషించారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జోడు సభల వ్యవస్థను కొన సాగించడంపై చర్చ జరుగుతున్న సమయంలో, పెద్దల సభ అవసరం ప్రశ్నగా మారిన  నేపధ్యంలో భారత పార్లమెంట్ ఎగువ సభ చారిత్రక మైలు రాయిని దాటడం నిజంగా ఒక విశేషం. ఒక చారిత్రక సందర్భం. రాజ్య సభ వారసత్వం పార్లమెంట్ సభ్యులకే కాదు, భారతీయులుగా మందరికీ కూడా ఎంతో గర్వకారణం.    

 

రచన: శంకర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్