భారత-జపాన్ విదేశాంగ… రక్షణ మంత్రులస్థాయి తొలి సమావేశం

   భారత-జపాన్ విదేశాంగ… ర‌క్ష‌ణ మంత్రుల స్థాయి తొలి స‌మావేశం న్యూఢిల్లీలో జ‌రిగింది. జ‌పాన్ ప్ర‌భుత్వంలో ఈ శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు ‘తొషిమిత్సు మోతెగీ’, ‘తారా కానో’- భార‌త విదేశాంగ‌, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు డాక్ట‌ర్ S.జైశంక‌ర్‌, రాజ్‌నాథ్ సింగ్‌ల‌తో ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగు, ర‌క్ష‌ణ‌-వ్యూహాత్మ‌క బంధం విస్తృతికి ఈ స‌మావేశం ఒక సూచిక‌. లోగడ 2000 సంవత్సరం నుంచి భార‌త్‌, జ‌పాన్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కింద సంయుక్త కార్యాచ‌ర‌ణ బృంద అధికారుల స్థాయి స‌మావేశాలు మాత్రమే జ‌రిగాయి. ఆ త‌ర్వాత 2010 నుంచి కార్య‌ద‌ర్శుల స్థాయిలో నిర్వ‌హిస్తుండ‌గా, ఇప్పుడు మంత్రిత్వశాఖ‌ల‌ స్థాయికి చేర‌డం విశేషం. ఈ త‌రహా ద్వైపాక్షిక స‌మావేశాలపై 2000-2001 మ‌ధ్య ప్ర‌ధాన‌మంత్రులు A.B.వాజ్‌పేయి, యోషిరో మోరీల కాలంలో వ‌చ్చిన ప్ర‌తిపాద‌న నేడు సాకార‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు మంత్రుల స్థాయి స‌మావేశం అనంత‌రం రెండు దేశాల త‌ర‌ఫున సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. పాకిస్థాన్ భూ భాగం నుంచి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఉగ్ర‌వాదులు ప్రాంతీయ శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పుగా పరిణ‌మించిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేసింది. అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌త మండ‌లి తీర్మానాల‌ను అమ‌లు చేయాల‌ని ఉత్త‌ర‌కొరియాకు విజ్ఞ‌ప్తి చేసింది. త‌ద‌నుగుణంగా సామూహిక మార‌ణ‌కాండ‌కు దారితీసే ఆయుధాల‌ను, ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను ధ్వంసం చేయాల‌ని కోరింది. 

   జపాన్ ప్ర‌ధాన‌మంత్రి షింజో అబే ఈ నెలాఖ‌రులో భారత-జ‌పాన్ వార్షిక శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఢిల్లీ రానుండగా ఇద్ద‌రు మంత్రుల‌స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌కు తొలుత‌ 2006 నుంచి ఉత్తేజం ల‌భించ‌గా, 2007లో సంయుక్త సైనిక విన్యాసాల‌తో వేగం పుంజుకున్నాయి. అటుపైన 2014 నుంచి వార్షిక శిఖ‌రాగ్ర స‌ద‌స్సు క్ర‌మంగా సాగుతోంది. కాగా- భార‌త్ నిర్వ‌హిస్తున్న సంయుక్త సైనిక క‌స‌ర‌త్తులో ప్రధానమైన మ‌ల‌బార్ విన్యాసాల్లో జ‌పాన్ 2015 నుంచి భాగ‌స్వామి అయింది. అటుపైన ఉగ్ర‌వాదం నిరోధంపై నిరుడు భార‌త-జ‌పాన్‌ ప‌దాతి ద‌ళాలు తొలిసారి సంయుక్త విన్యాసాలు నిర్వ‌హించాయి. ఇదే క్ర‌మంలో సంయుక్త వైమానిక‌ద‌ళ క‌స‌ర‌త్తు నిర్వ‌హ‌ణ‌పై స‌మాలోచ‌న చేస్తున్న త‌రుణంలో ప్ర‌స్తుత మంత్రుల స్థాయి స‌మావేశం దీనిపై చ‌ర్చించింది. ఈ నేపథ్యంలో త్వ‌ర‌లోనే ఈ సంయుక్త వైమానిక ద‌ళ విన్యాసాలు సాకారం కాగల అవ‌కాశాలున్నాయి.

   ద్ద‌రు మంత్రుల స్థాయి స‌మావేశాలపై జ‌పాన్‌కు ఆరు దేశాల‌తో అవ‌గాహ‌న ఉండ‌గా- భార‌త్  కేవ‌లం అమెరికా, జపాన్‌ల‌తో మాత్ర‌మే ఈ త‌ర‌హా చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తోంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబ‌రులో ఐక్య‌రాజ్య సమితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశాల సంద‌ర్భంగా అమెరికా, భార‌త్‌, జ‌పాన్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు తొలిసారి చ‌తుర్ముఖ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం 15 రోజుల కింద‌ట నాలుగు దేశాల స్థాయిలో ఉగ్ర‌వాద నిరోధంపై మొట్ట‌మొద‌టి ఆచ‌ర‌ణాత్మ‌క క‌స‌ర‌త్తు నిర్వ‌హించారు. దీంతో చ‌తుర్ముఖ కూట‌మికి కొత్త ఊపు ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఇండో-ప‌సిఫిక్ ప్రాంత శాంతి నిర్వ‌హ‌ణపై ఇద్ద‌రు మంత్రుల స్థాయి తాజా స‌మావేశం ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. స‌ద‌రు చ‌ర్చ‌లు- ఈ ఏడాది బ్యాంకాక్‌లో తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌ద‌స్సులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌సంగానికి అనుగుణంగా ఉన్న‌ట్లు వారు పేర్కొంటున్నారు. స‌ముద్ర మార్గంలో స్వేచ్ఛా ప‌య‌నం, శాంతి-సుస్థిర‌త‌ల కోసం ‘‘ఇండో-ప‌సిఫిక్ మ‌హాస‌ముద్ర కార్యాచ‌ర‌ణ‌’’ గురించి ప్ర‌ధాని అప్పటి త‌న ఉప‌న్యాసంలో నొక్కిచెప్పారు. 

   అనేక ప్రాజెక్టులుస‌హా హైస్పీడ్ రైళ్ల ప‌థ‌కం త‌దిత‌రాల రూపేణా భారత-జ‌పాన్‌ బంధం బ‌ల‌ప‌డుతోంది. అలాగే ర‌క్ష‌ణ‌రంగ ప్రాజెక్టులు రానుండటంతో ప‌ర‌స్ప‌ర విశ్వాసం మ‌రింత ప‌టిష్ఠం కానుంది. అందుకు త‌గినట్లు ‘‘కొనుగోళ్లు-ప‌ర‌స్ప‌ర సేవ‌ల ఒప్పందం’’పై సంప్రదింపులను త్వ‌ర‌గా ముగించాల‌ని ఇద్ద‌రు మంత్రుల స్థాయి స‌మావేశంలో ఉభ‌య‌ప‌క్షాలూ ఆకాంక్షించాయి. దీనివల్ల రెండువైపుల నుంచీ రక్షణరంగ సహకారం మరింత విస్తరిస్తుంది. భార‌త్ 2018 డిసెంబరులో ‘‘హిందూ మహాసముద్ర ప్రాంత సమాచార సంలీన కేంద్రం’’ను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఈ కేంద్రంలో జపాన్ త‌మ అనుసంధాన అధికారిని త్వ‌ర‌లో నియ‌మించ‌నుంది. కాగా- 2010లో ప్రారంభ‌మైన ర‌క్ష‌ణ-సాంకేతిక‌ స‌హ‌కారానికి ఇద్ద‌రు మంత్రుల స్థాయి స‌మావేశంలో చ‌తుర్ముఖ ఊపు ల‌భించింది. దీనివ‌ల్ల మాన‌వ‌ర‌హిత వాహ‌నాలు, రోబోటిక్స్ వంటి సాంకేతిక ప‌రిజ్ఞానాల ఆదాన‌ప్ర‌దానాలకూ స‌హ‌కారం విస్త‌రించింది. ఆ మేర‌కు విస్తృత అంశాల‌పై భార‌త ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌-అభివృద్ధి సంస్థ‌-DRDO… జ‌పాన్ ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న సంస్థ‌కు స‌హ‌కారం అందిస్తోంది. ఇక‌ ద‌క్షిణ చైనా స‌ముద్ర అంశం కూడా మంత్రుల‌స్థాయి భేటీలో ప్ర‌స్తావ‌న‌కొచ్చింది. ఈ ప్రాంతంలో నౌకా-విమాన ప్ర‌యాణ స్వేచ్ఛ‌, అవ‌రోధాల్లేని చ‌ట్ట‌బ‌ద్ధ వాణిజ్యానికిగల ప్రాముఖ్యంపై చ‌ర్చ సాగింది. ఆ మేర‌కు స‌ముద్ర చ‌ట్టాల‌పై ఐక్య‌రాజ్య స‌మితి స‌ద‌స్సు తీర్మానాలను ప్ర‌తిబింబిస్తూ- సార్వ‌త్రిక గుర్తింపు పొందిన అంత‌ర్జాతీయ చ‌ట్ట సూత్రావ‌ళికి అనుగుణంగా… దౌత్య ప్ర‌క్రియ‌ల‌కు పూర్తి గౌర‌వ‌మిస్తూ- ఈ ప్రాంత దేశాలు తమ వివాదాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ఉభ‌య‌ప‌క్షాలూ నొక్కిచెప్పాయి.

రచన: సుమన్ శర్మ, పాత్రికేయులు