ఇరాన్ నిరసనలతో దద్దరిల్లిన గల్ఫ్

ఇరాన్ ప్రభుత్వం గత నెల పెట్రోలుకు రేషను విధిస్తున్నట్టు ప్రకటించింది. తన నిరుపేద పౌరులకు సహాయం నిమిత్తం అదనపు ధనం కోసం ఈ చర్య చేపడుతున్నట్టు చెప్పింది. చమురు సంపన్న దేశ ప్రభుత్వం చేసిన ఈ ఆకస్మిక ప్రకటనతో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా తీవ్ర ఆగ్రహం చెందిన ప్రజలలో నిరసనలు వెల్లువెత్తాయి. వేగంగా పలు నగరాలకు వ్యాపించాయి. ఈ నిరసనలు రాజకీయ రంగు పులుముకుని ప్రభుత్వ సుస్థిరతకు పెను సవాలుగా నిలిచాయి.

ఈ అల్లర్లకు బహిష్కృతులైన ప్రతిపక్ష గ్రూపులు విదేశీ విరోధులు కారణమని ఇరాన్ అధికారులు ఆరోపించారు. గట్టిగా స్పందించి అణచివేసే ప్రయత్నం చేసారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు మరింత వ్యాపించకుండా అరికట్టేందుకు అంతర్జాలంపై దాదాపు మొత్తం మూసివేతను విధించారు. ఈ అల్లర్ల ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ ఉనికికి ముప్పు వాటిల్లజేయటమే ధ్యేయమని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐ.ఆర్.జి.సి) ప్రధానాధిపతి తెలిపారు.

ఈ అల్లర్లలో ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా లెక్కలు ప్రకటించనప్పటికీ కనీసం 208 మరణాలను తాను నమోదు చేసినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. కాగా ఇప్పటి కల్లోలాలలో కనీసం 2 వేల మంది గాయపడ్డారనీ, మరో 7 వేల మందిని ఇరాన్ భద్రతా దళాలు నిర్బంధించినట్టూ వార్తలు తెలుపుతున్నాయి.

ఇలా వుండగా ఇరాన్ మీడియా ఎటువంటి సంఖ్యలు ఇవ్వకుండా కొంతమంది నిరసనకారులు భద్రతాదళాల చేతిలో హతం కావటం నిజమేనని తెలిసింది. వారిని సాయుధ టెర్రరిస్టులుగా పేర్కొంది. అల్లర్లను అణచివేయడంలో భద్రతా దళాల శక్తియుక్తులను కొనియాడింది. ఈ సందర్భంగా CIA తో లింకు వున్న కనీసం 8 మందిని అరెస్టు చేసినట్టు ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. ఇక దాదాపు 2 వారాల హింసాత్మక ఘర్షణల అనంతరం ఈ వారంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రాహాని టెలివిజనులో మాట్లాడుతూ – అరెస్టు చేసినవారిలో నిరాయుధులు లేదా అమాయక ప్రజలు వున్న పక్షంలో వారిని విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.

ఇరాన్ తో పాటు ఆరు ప్రపంచ దేశాలు అంగీకరించిన అణు ఒప్పందం నుండి నిరుడు వైదొలగిన అనంతరం అమెరికా తీవ్ర ఆంక్షలు విధించిన సమయంలో ఇరాన్ లో ఈ అశాంతి చెలరేగింది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు – గ్యాసు ఎగుమతులలో తీవ్రమైన నిర్బంధాలను ఎదుర్కొంటోంది, పలితంగా ఫెట్రో డాలర్లు కరువైన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలు ఇరానీ ప్రజల రోజువారీ జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. వారు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు. అయితే ప్రజల ఇక్కట్లకు విదేశీ విరోధులే కారణమంటూ నిందమోపే అదను ఇరాన్ ప్రభుత్వానికి చిక్కింది.

చమురు ధరల పెరుగుదల వల్ల అల్లర్లు చెలరేగినప్పటికీ ఇరాన్ లో ప్రస్తుత అల్లర్లు మాత్రం దీర్ఘకాలంగా ఇరాన్ – అమెరికాల మధ్య గల ప్రతిష్ఠంభన పరిణామాలేనని చెప్పక తప్పదు. ప్రస్తుత సంక్షోభాన్ని ముగించటానికి అమెరికాతో చర్చలకు తాను సిద్ధమేననీ కానీ ముందుగా అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలనీ ఇరాన్ అంటోంది. 

అయితే అమెరికా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తాను కూడా సంప్రదింపులకు సిద్ధమేనని అయితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని రద్దు చేసి క్షిపణి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలనీ ప్రాంతీయ కార్యకలాపాలలో సంయమనం పాటించాలనీ అప్పుడే ఆంక్షలను ఎత్తివేస్తాననీ పట్టుబడుతోంది. దీంతో ఇరాన్ – అమెరికాల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడి సమస్య పరిష్కారానికి మార్గం కానరావటం లేదు. ఫలితంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది.

అస్థిరంగా వున్న ఇరాన్ మాత్రం ఎవరి ప్రయోజనాలను లెక్క చేయటం లేదు. జాతి మైనార్టీల జనాభా వున్న ఖుజెస్తాన్, సిస్తాన్, బలూచీస్తాన్, కుర్దిస్తాన్ తదితర ఇరాన్ రాష్ట్రాలలో నిరసనకారులను అణచివేస్తే అది మరింత హింసకు దారి తీస్తుందని భయపడుతోంది. ఇరాన్ మత పాలన తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాలను అంతర్గత, బాహ్య విరోధులకు శక్తిని చాటుకునేందుకు ఇటువంటి నిరసనలను ఉక్కు పాదంతో అణచి వేస్తుందని కూడా భయపడుతున్నారు.

కల్లోలిత ఇరాన్ గానీ అందుకు సంబంధించి గల్ఫ్ ప్రాంతంలో గందరగోళం పైగానీ భారత్ కు ఏమాత్రం ఆసక్తి లేదు. అనాదిగా తనకు ప్రముఖ చమురు ఎగుమతిదారుగా ఉన్న ఇరాన్ సహా గల్ఫ్ దేశాలతో భారత్ సత్సంబంధాలు కలిగి వుంది. ఇరాన్ లోని చాబహర్ రేవును న్యూఢిల్లీ అభివృద్ధి చేస్తోంది కూడా. అయితే ఈ ప్రాంతంలో మరిన్ని అలజడలు ఈ విధమైన పెట్టుడులకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి.

 

రచన : డా. ఆసిఫ్ షుజ, ఇరాన్ పై వ్యూహాత్మక విశ్లేషకులు