పార్ల‌మెంటులో ఈ వారం

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజ్యసభ – ఎగువసభ ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు SPG(సవరణ)- 2019 బిల్లులను ఆమోదించింది. దాద్రా – నగర్ హవేలీ, దామన్ – డయు (కేంద్ర పాలిత ప్రాంతాల విలీనం) బిల్లు 2019ని కూడా ఎగువ సభకు సమర్పించారు.

దిగువసభ – లోక్సభలో పన్ను విధింపు చట్టాల (సవరణ) బిల్లు – 2019ని ఆమోదించారు;  బిల్లు – కార్పొరేటు పన్నులను బాగా తగ్గించింది. ఈ అంశంపై సభలో వాడివేడి చర్చ జరిగింది. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ – వృద్ధిని పెంపొందించేందుకు పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పారు. చైనా – అమెరికాల మధ్య ప్రస్తుత వాణిజ్య పోరు నేపథ్యంలో చైనాకు ప్రత్యామ్నాయాన్ని వెదుకుతున్న బహుళ జాతి సంస్థల‌కు (MNCW)సమర్ధమైన గమ్యంగా భారత్ ను రూపొందించే వ్యూహాత్మక నిర్ణయమని వివరించారు. అక్టోబరు 1వ తేదీ తర్వాత నమోదు చేసుకుని మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లో పెట్టుబడి పెట్టే ఏ సంస్థలైనా 15 శాతం రేటు చెల్లిస్తే సరిపోతుందని మంత్రి చెప్పారు. అయితే అది ఎటువంటి మినహాయింపులు పొందరాదని, 2023 మార్చి 31 లోపు ఉత్పత్తి ప్రారంభించాలసి వుంటుంందనీ కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు.

సుంకంతోను, సర్ ఛార్జితోను కలుపుకుని పన్ను రేటు 17 శాతానికి చేరుతుందున్నారు. పన్ను కోతను పరిశ్రమ దిగ్గజాలు స్వాగతించాయి. భారత కంపెనీలు పోటీకి దీటుగా తయారయ్యేందుకు వీలుగా మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యగా దీనిని అభివర్ణించాయి.

కాగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల బిల్లు – 2019ని ఎగువసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, నిల్వ, ప్రకటనలను బిల్లు నిసేధిస్తుంది. ఇ-సిగరెట్లు ధూమపానికే నికొటిన్ తోపాటు ఇతర ర‌సాయ‌న‌ పదార్థాలతో కూడిన ఆవిరిని సృష్టిస్తాయని బిల్లు నిర్వచిస్తోంది. చట్టం కింద ఏడాది వరకు జైలుశిక్ష, ఒక మిలియన్ అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంటుంది. ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ ఈ అంశంపై చర్చకు సమాధానమిచ్చారు. పొగాకు నియంత్రణలో ఎదురుకాగల సవాళ్ళను ఊహించి సకాలంలో చర్యలకు భారత్ సంకల్పాన్ని బిల్లు స్పష్టం చేస్తుందన్నారు.

స్పెషల్ ప్రొటెక్షన్ బిల్లు – 2019ని కూడా ఎగువసభ ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్సభ కిందటివారం ఆమోదం తెలిపింది. దీనికింద ప్రధానమంత్రికి, ఆయన అత్యంత సమీప బంధువులకు మాత్రమే SPG రక్షణ కల్పించాలని ప్రతిపాదించింది. అలాఏ మాజీ ప్రధానమంత్రికి, ఆయన కుటుంబానికి ఐదేళ్లపాటు ఈ రక్షణ లభిస్తుంది. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా – నగర్ హవేలీలను విలీనం చేసే మరో బిల్లు కూడా లోక్ స‌భ ఆమోదం పొందింది. విలీనమైన ఈ ప్రాంతానికి దాద్రా – నగర్ హవేలీ డామన్ – డయూగా నామకరణం చేస్తారు. లోక్సభ ఆమోదించిన నౌకల రీసైక్లింగ్ బిల్లుకింద నౌకలలో హాని కరమైన పదార్థాల వాడకాన్ని నియంత్రించి, నౌకల రీసెక్లింగును క్రమబద్ధీకరిస్తుంది.

ఇంకా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు లేదా CAB క్యాబ్ను వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌరపట్టిక (NRC) ప్రక్రియను చేపట్టాలని భారతీయ జనతాపార్టీ కృతనిశ్చయంతో ఉన్నందున CAB కు డిసెంబరు 4న లభించిన క్యాబినెట్ ఆమోదం కీలకమైంది. 

ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందు, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ శరణార్థులకు పౌరసత్వం కల్పించాలనేది బిల్లు లక్ష్యం. కాగా, 1955 నాటి పౌరసత్వ చట్టం సరైన ప్రయాణ పత్రాలు లేని లేదా నిర్ణీత సమయాన్ని మించి వున్న వ్యక్తిని అక్రమ వలసదారుగా ముద్ర వేస్తుంది. ఈ బిల్లును ఆనాటి చట్టానికి జరిగిన పెనుమార్పుగా చెప్పాలి.

అలాగే వ్యక్తిగత డాటా పరిరక్షణ బిల్లు కూడా క్యాబినెట్ ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్టనున్నారు. వ్యక్తిగత డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగుతో పాటు వ్యక్తుల సమ్మతి, జరిమానాలు, పరిహారం, ప్రవర్తనా నియమావళి, అమలుపై విస్తృతస్థాయి మార్గదర్శకాలను రూపొందించాలని బిల్లు భావిస్తోంది. బారతదేశంలో ఆర్థిక, ఆరోగ్య రికార్డులు సహా కీలకమైన డేటాను భద్రపరచాల్సిన అవసరం ఉంది. ఒకసారి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ సంస్థలకు నిబంధనలను నిర్వచించి చెప్తారు.

భారత శిక్షాస్మృతిలోను, క్రిమినల్ ప్రొసీజరు కోడ్లోను తగిన సవరణలను సూచించేందుకై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా సభకు తెలియజేశారు.

ఎగువసభలో ప్రశ్నోత్తరాల సమయంలో దేశవ్యవహారాల శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ – దేశం నుండి అక్రమ వలసదారు లందరినీ వారి స్వ‌దేశాల‌కు వెనక్కి పంపాలని రాష్ట్రాలకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

 

ర‌చ‌న : యోగేశ్ సూద్, పాత్రికేయులు