కొనసాగుతున్న భారత్ వృద్ధి – OECD ఆర్థిక సర్వే వెల్లడి

భారత ఆర్థిక సర్వేపై ఆర్థిక సహకారం – అభివృద్ధి సంస్థ (OECD) గతవారం న్యూఢిల్లీలో విడుదల చేసిన నివేదికలో భారత్ వృద్ధిరేటు దృఢంగా, సుస్థిర పథంలో కొనసాగుతుందని చెప్పింది. అయితే ప్రైవేటు కార్పొరేటు పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తులు వెనుకబడి వున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత దేశ వృద్ధి కథ ప్రధానంగా వినియోగం ద్వారా నడుస్తుంది. పన్నుల సరళీకరణ, వ్యాపార సౌలభ్య బలోపేతం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల పెంపుదలకు సంస్కరణల అనంతరం వేగం కోల్పోయిన వృద్ధి క్రమంగా పుంజుకుంటుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ మంచి నాణ్యత గల ఉద్యోగాల కల్పనలో గ్రామీణ ఆదాయంలో స్తబ్ధత కీలకమైన సవాళ్ళుగానే మిగిలిపోయాయి.

దేశంలోని రాష్ట్రాలలో ఆర్థిక సారూప్యత కొరవడటం అంటే పేద  రాష్ట్రాలు ధనిక రాష్ట్రాల వడిని అందుకోలేకపోవటం అనే అంశంపై తక్షణ శ్రద్ధ చూపాలి. దేశంలో అంతర్గతంగా వున్న అసమానతలు విస్తృతమవకుండా తుంచివేయాలి.

నివేదిక విడుదల చేసిన సందర్భంగా OECD అధిపతి, ఆర్థికవేత్త లారెన్స్ బూనె మాట్లాడుతూ – ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యిప్పుడు వృద్ధిలో ఛాంపియన్ గా బాగా స్థిరపడిందని అన్నారు. ఆర్థిక వృద్ధి కోలుకోవాలంటే నింతరమైన సంస్థాగత సంస్కరణలు అవసరం అవుతాయి. 

OECD ఆర్థిక సర్వే భారత్ ఆర్థిక వృద్ధి 2020లో 6.2 శాతంగాను, 2021లో 6.4 శాతంగాను వుంటందని చెప్పింది. 2019లో ప్రస్తుత 5.8 శాతం వృద్ధిని పునరుద్ధరించడానికి గుమతులు పెట్టుబడుల పునరుద్ధరణ అవసరమని నివేదిక పేర్కొంది. ఆర్థిక సమ్మిళిత చర్యలతోపాటు ఫెడరలిజానికి నూతన ప్రతిపాదనలు, నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారం ద్వారా ఆర్థికరంగం మెరుగుదల, లక్ష్యత కుటుంబాలకు సంబంధించి మెరుగైన బదిలీల ప్రారంభం, దివాళా నియమావళి సక్రమ అమలు, జి.ఎస్.టి కార్పొరేటు పన్నుల సంస్కరణల అమలు వ్యవస్థాగత సంస్కరణలలో ప్రధానమైనవని నివేదిక తెలిపింది.

ఇక విదేశీరంగానికి వస్తే సేవలలో వాణిజ్యానికి ఆంక్షలను తగ్గించడం వల్ల ఆర్థికవ్యవస్థ ఊపందుకుంటుందని OECD నివేదిక పేర్కొంది. ప్రపంచంలో వస్తువులు – సేవల ఎగుమతులలో 1990ల ప్రారంభంలో 0.5 శాతంగా వున్న భారత్ వాటా 2018లో 2.1 శాతానికి పెరిగిందని OECD అంచనాలు సూచిస్తున్నాయి.

ఈ వృద్ధికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఔషధాలు ప్రధాన కారకాలుగా తెలిపింది.

ఇంకా ఫిజికల్ – సోషల్ మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక వనరులను కల్పించడం, కార్మిక చట్టాల ఆధునికీకరణ, ఆర్థిక వ్యవస్థలో ఎక్కువమంది మహిళలను నియమించడం, వాణిజ్య నిబంధనల తగ్గింపు ఆర్థిక రంగాన్ని మెరుగుపరచటం, అద్దె నిబంధనలు – ఆస్తి హక్కులను బలోపేతం చేయటం ద్వారా అందరికీ చౌకలో గృహ వసతి కలిగేలా చూడటం వంటి సంస్కరణలు వృద్ధి వేగాన్ని పెంచుతాయని కూడా OECD నివేదిక ప్రముఖంగా చెప్పింది. ఆదాయ అసమానతలు శ్రమ శక్తిలో మహిళల భాగస్వామ్యం వంటి సామాజిక సవాళ్ళ పరిష్కారం పట్ల నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2014 నుంచి దాదాపు 100 మిలియన్ మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నిర్మూలన వంటి ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య విషయంలో ఫలితాలను మెరుగు పర్చటంలో తోడ్పడ్డాయని నివేదిక తెలిపింది. అలాగే మహిళా సాధికారత కోసం ఆడ శిశువుల భ్రూణహత్యలను తగ్గించడానికి, బాలికల విద్యకు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ముదావహమని OECD నివేదిక అభినందించింది.

కాగా శ్రేయస్సును కాంక్షించి వాతావరణ మార్పును అదుపు చేయడానికి హరిత వృద్ధికి మరింత ప్రాధాన్యం యివ్వాలని OECD నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం అధికంగా వుందని చర్య లేని పక్షంలో అది మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో అకాల మరణాలకు ఇంటిలోపలి వాయు కాలుష్యం ప్రధాన కారణంగా ఉంది. పేదలకు క్లీన్ గ్యాసు కనెక్షన్లకు సబ్సిడీ కల్పించటం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టినప్పటికీ అమలు విషయంలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యానికి గురవుతున్న పది నగరాలలో 9- భారత్ లోనే డటం గమనార్హం.

OECD భారత్ ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణ్యన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సీనియర్ అధికారుల సమక్షంలో సమర్పించారు.

ఇక నూతన ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటంలో భారత్ విజయం సాధించిందని OECD నివేదిక ప్రశంసించింది. చివరగా స్థూల ఆర్థిక విధానాలను – పాలనను మెరుగుపరచటం, పెట్టుబడులను పెంచటం, సామాజిక అసమానతల తొలగింపు, భౌగోళిక ఆర్థిక వ్యవస్థలో మెరుగైన భాగస్వామ్యం, ఆస్తి యాజమాన్యం పెంపొందింపుతో పాటు చౌకలో గృహనిర్మాణం, హరితవృద్ధిని ప్రోత్సహించటం మొదలైనవి  OECD నివేదిక ముఖ్య సిఫార్సులు.

రచన : డా.లేఖా ఎస్.చక్రవర్తి, ప్రొఫెసర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ