భార‌త ప్రాంతీయ ఆర్థిక సంబంధాల వ్యూహం-2020… భ‌విష్య‌త్తు

   కొత్త సంవ‌త్స‌రం 2020… స‌రికొత్త‌గా ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో విస్ప‌ష్టంగా నిర్వ‌చించ‌బ‌డిన‌, చ‌క్క‌గా రూపొందిన భార‌త ప్ర‌భుత్వ ప్రాంతీయ ఆర్థిక సంబంధాల ప్రారంభ వ్యూహం మ‌న దౌత్య రంగంలో ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కాస్త అనుచిత‌మైన‌ప్ప‌టికీ ప్రాంతీయంగా ప్రాధాన్యంగ‌ల మార్గాలుగానే ఇటీవ‌లి కాలందాకా ప‌రిగ‌ణించ‌బ‌డ్డాయి. ఆయా దేశాల వాణిని అంత‌ర్జాతీయంగా వినిపించాలంటే భార‌త‌దేశం కూడా అటువంటి వాటిని ఇష్టంగానో, అయిష్టంగానో స్వీక‌రించ‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న ఇప్ప‌టిదాకా ఉండేది. కానీ, ప్రాంతీయ స‌మ‌గ్ర ఆర్థిక భాగ‌స్వామ్యం-RCEP నుంచి భార‌త్ వైదొల‌గ‌డంతో ఈ భావ‌నకు నాట‌కీయంగా తెర‌ప‌డింది. ఇది మన విదేశీ ఆర్థిక విధానంలో వ్యూహాత్మక మార్పును స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా అస‌మ‌గ్ర వాణిజ్య ఒప్పందాలపై కొంత స‌హ‌నంతో ప్రాంతీయ ఔచిత్య‌ వ్యూహాలను అనుసరించక త‌ప్ప‌ద‌న్న అభిప్రాయం కూడా తొల‌గిపోయింది. కాగా, బ్యాంకాక్‌లో RCEP శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా- ఆ భాగ‌స్వామ్యం నుంచి వైదొల‌గాల‌ని సాక్షాత్తూ భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా భార‌త త‌న సందేశాన్ని ప్ర‌పంచానికి సుస్ప‌ష్టంగా, బ‌లంగా చాటింది. భారత రైతాంగంతోపాటు సూక్ష్మ‌-చిన్న-మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల రంగాల ప్రయోజనాలతో ప్ర‌ధాన డిమాండ్లు సంఘ‌ర్షించే ప‌క్షంలో అటువంటి వేదిక‌ల నుంచి వైదొలగడానికి భారత్ క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌ద‌ని దీంతో స్ప‌ష్ట‌మైంది. ఆ మేర‌కు ఆర్థిక దౌత్యం, కీల‌క జాతీయ ప్ర‌యోజ‌నాల మ‌ధ్య స‌మ‌తూక‌మే మ‌న సంబంధాల్లో ప్ర‌ధానాంశం కావాలి. ప్ర‌పంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టైన భార‌త్‌- రాబోయే ఐదేళ్ల‌లో 5 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించే దిశ‌గా పురోగ‌మిస్తోంది. అయితే, దేశీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కీల‌క‌మైన రంగాల ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించే వ్యూహాల‌తో ఈ ప్ర‌గ‌తిని సాధించాల‌ని మాత్రం భావించ‌డం లేదు.

   భార‌త్ అనుస‌రిస్తున్న “తూర్పువైపు చూపు-తూర్పు కార్యాచ‌ర‌ణ‌” విధానాల‌కు అనుగుణంగానే వాణిజ్య ఒప్పందాల్లో అధిక‌శాతం తూర్పు ఆసియా పొరుగుదేశాల‌తో కొన‌సాగుతున్నాయి. అయితే, భారీ వాణిజ్య లోటు, భార‌త ఉత్ప‌త్తుల‌కు విదేశీ విప‌ణుల ల‌భ్య‌త‌పై నియంత్ర‌ణ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సుంకాల శాతంలో అస‌మాత‌న‌ల ఫ‌లితంగా ఈ ఒప్పందాల్లో కుదుపు త‌ప్ప‌లేదు. విదేశీ వ్యూహాత్మక, ఆర్థిక విధానాల ప‌ర‌స్ప‌ర విరుద్ధ డిమాండ్ల మధ్య న‌డుమ ఇర‌కాటంతోపాటు కీలక దేశీయ ప్రయోజనాలు, రంగాల రక్ష‌ణ దిశ‌గా చ‌ర్చ‌ల్లో అనుస‌రించాల్సిన తీరుపై ప్ర‌భుత్వం నుంచి నిర్దిష్ట‌, సుస్ప‌ష్ట విధానప‌ర‌మైన ఆదేశాలను దౌత్యవేత్తలు అభిల‌షిస్తారు. అందుకే మున్ముందు అనుస‌రించాల్సిన విధానాల‌ను ప్ర‌భుత్వం విశ‌దంగా రూపొందించింది. ఆ మేర‌కు వాణిజ్య ఒప్పందాల‌పై సంప్ర‌దింపుల సంద‌ర్భంగా భార‌త్ ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణిని అనుస‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని, అలాగే కీల‌క జాతీయ ప్ర‌యోజ‌నాలపై రాజీప‌డ‌రాద‌ని స్ప‌ష్టీక‌రించింది. ఉభ‌య‌తార‌కంగానూ, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగానూ ఒప్పందాలు కుదిరేలా సంప్ర‌దింపులు సాగాల‌ని విశ‌దీక‌రించింది. రక్షణాత్మక విధానాల వైపు మళ్లుతున్నామ‌న్న ఆందోళ‌న‌ను తొల‌గిస్తూ- ప్రస్తుత ఒప్పందాల పునఃస‌మీక్ష‌తోపాటు తిరిగి  సంప్ర‌దింపులు చేప‌ట్ట‌డంపై భార‌త్ త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేసింది. అదే త‌ర‌హాలో కొత్త ద్వైపాక్షిక వాణిజ్య‌ ఒప్పందాలు స‌మ‌తూకంతో, స‌ముచితంగా ఉండేవిధంగా దృష్టి సారించాల‌ని సూచించింది. త‌ద‌నుగుణంగా దక్షిణ కొరియా, జపాన్, ఆసియాన్ దేశాల‌తోగ‌ల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లోని మూల నియ‌మాలు, సుంక‌ర‌హిత అవ‌రోధాల‌పై సమీక్షకు వీలు క‌ల్పించే నిబంధనలను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భార‌త్ అభిప్రాయ‌ప‌డుతోంది.

    మేర‌కు ఐరోపా స‌మాఖ్య‌తో “విస్తృత ప్రాతిప‌దిక‌న వాణిజ్యం-పెట్టుబ‌డుల ఒప్పందం”పై నిలిచిపోయిన చ‌ర్చ‌ల పునఃప్రారంభం అంశాన్ని భార‌త్ ఇప్పుడు ముందుకు తెచ్చింది. తాజా చ‌ర్చ‌ల‌తో దీన్ని ప‌రిష్క‌రించుకోవ‌డంపై ఉభ‌య ప‌క్షాలూ సానుకూలంగానే క‌నిపిస్తున్నాయి. త‌ద‌నుగుణంగా వ్య‌వ‌సాయ విప‌ణుల ల‌భ్య‌త‌, సుంకాల విధింపు విధానం, మేధోహ‌క్కులు త‌దిత‌ర చిక్కుముడులు విప్పేందుకు సిద్ధ‌మవుతున్నాయి. అంతేకాకుండా అమెరికాతోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చ‌ర్చ‌ల‌తో భార‌త్ చురుగ్గా ముంద‌డుగు వేస్తోంది. అలాగే ఐరోపా స‌మాఖ్య నుంచి బ్రిట‌న్ వైదొలిగిన త‌ర్వాత ఆ దేశంలో స్వ‌తంత్ర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అంశం కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. మ‌రోవైపు భార‌త‌దేశానికి గ‌ణ‌నీయ ల‌బ్ధి ఒన‌గూడే వీలున్న నేప‌థ్యంలో  ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, యురేషియా ఆర్థిక స‌మాఖ్య‌ల‌తోనూ చ‌ర్చ‌ల‌కు ప్ర‌తిపాద‌న‌లున్నాయి. స్వేచ్ఛా, పార‌ద‌ర్శ‌క వాణిజ్యంతోపాటు పెట్టుబ‌డుల‌ద్వారా అంత‌ర్జాతీయ‌, ప్రాంతీయ విలువ శృంఖ‌లాల్లో స‌మ‌గ్ర భాగం కావాల‌న్న ఉద్దేశాన్ని కూడా భార‌త్ సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల‌పై సంప్ర‌దింపుల‌కు ముందు త‌గురీతిలో సంసిద్ధ‌త‌స‌హా భాగ‌స్వాముల‌తో చ‌ర్చ‌లు సాగాల‌ని కూడా భార‌త ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ ఒప్పందాల విష‌యంలో హ‌డావుడి త‌గ‌ద‌ని, కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో సుంకాలు, నియంత్ర‌ణ యంత్రాంగంలో మార్పుల దిశ‌గా వాణిజ్య‌-పారిశ్రామిక భాగ‌స్వాములు సిద్ధ‌మయ్యేందుకు అవ‌స‌ర‌మైనంత స‌మ‌యం ఇవ్వాల‌ని పేర్కొంటోంది. అలాగే భ‌విష్య‌త్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో వ‌స్తు రంగంలో మాత్ర‌మేగాక భార‌త్ బ‌లంగా ఉన్న సేవ‌ల రంగంలోనూ మ‌న ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేయాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో భారత ప్రాంతీయ ఆర్థిక సంబంధాలకు సంబంధించి 2020 సంవ‌త్స‌రంలో స‌రికొత్త‌, ఉజ్వ‌ల అధ్యాయం ప్రారంభం కాగ‌ల‌ద‌ని ఆశిద్దాం!

 

రచన: స‌త్య‌జిత్ మొహంతి, IRS, సీనియ‌ర్ ఆర్థిక విశ్లేష‌కులు