ఒమ‌న్ : ఒక శకం ముగిసింది

ఒమాన్ ను ఐదు ద‌శాబ్దాల పాటు పాలించిన సుల్తాన్ కుబూస్ బిన్ స‌యిద్ – అల్ – స‌యిద్ ఈ నెల 10వ తేదీన క‌న్ను మూయ‌డంతో ఒమ‌న్ లో ఒక శ‌కం ముగిసింది. గ‌ల్ఫ్ దేశాల్లో కీల‌క దేశ‌మైన ఒమ‌న్ లో నూత‌న నాయ‌క‌త్వానికి మార్గం ఏర్ప‌డింది. గొప్ప వ్య‌క్తిత్వం క‌లిగిన కుబూస్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గౌర‌వం వుంది. ఆ ప్రాంతంలోని దిగ్గ‌జ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్ ల‌తో స‌మ‌దూరం పాటిస్తూనే ఒమాన్ కు ఒక స్వ‌తంత్ర విదేశాంగ విధానాన్ని కుబూస్ అందించారు. 1970లో త‌న తండ్రి స‌యిద్ బిన్ తైమూర్ ను ర‌క్త‌ర‌హిత తిరుగుబాటుతో గ‌ద్దె దింపి ఒమాన్ రాజ్య ప‌గ్గాలు చేప‌ట్టారు సుల్తాన్ కుబూస్‌.

ఒమాన్ ఆధునీక‌ర‌ణ‌కు దారులు వేసిన కుబూస్ – 1996లో తొలిసారిగా లిఖిత పూర్వ‌క రాజ్యాంగాన్ని తీసుకువ‌చ్చారు. రాజ‌కీయాలు, వ్యాపారం, క్రీడ‌ల‌లో మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించి వారి సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డ్డారు. 2015లో ఇరాన్ కీల‌క అణు ఒప్పందం చేసుకోవ‌డంలో ఆయ‌న‌ది కీల‌క‌పాత్ర‌. ఎమ‌న్ లో వైరి వ‌ర్గాల‌ను ఒక తాటిపైకి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. కుబూస్ కు సంతానం లేక‌పోవ‌డంతో ఒమాన్ రాజ్య ప‌గ్గాలు చేప‌ట్టేది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్ప‌టికీ ఆయ‌న కోరిక మేర‌కు త‌న మేన‌ల్లుడైన హ‌యిత‌మ్ బిన్ తారిఖ్‌ దేశ పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టారు.

ఆక్స్ ప‌ర్డ్ లో చ‌దువుకున్న తారిఖ్‌ సుల్తాన్ కుబూస్ పాల‌న‌లో సాంస్కృతిక మంత్రిగా వున్నారు. ఒమాన్ ప్ర‌ధానిగా, ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌మంత్రిగా, ఆదేశ సెంట్ర‌ల్ బ్యాంకు అధ్య‌క్షుడు ఒంటి చేత్తో పాల‌న సాగించిన కుబూష్ విడిచి వెళ్ళిన రాజ్యాన్ని తారిఖ్‌ అందుకున్నారు. కుబూస్ కు ద‌క్కిన అప‌రిమిత అధికారం, గౌర‌వం తారిఖ్‌కు ల‌భించ‌డం అంత సుల‌భ‌మైన విష‌యంకాదు. చిక్కులోవున్న ఆర్థిక ప‌రిస్థితి, నిరుద్యోగం నూత‌న సుల్తాన్ కు ఎదుర‌వుతున్న స‌వాళ్ళు. ప్రాంతీయ విభేదాల‌లో ఏదో ఒక ప‌క్షం వైపు వుండాల‌న్న వ‌త్తిడులు కూడా ఆయ‌న ఎదుర‌వుతాయి. కాగా గ‌తించిన సుల్తాన్ కుబూస్ విధానాల‌నే కొన‌సాగిస్తానాని దేశ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని రాజ్యాధికారాన్ని చేప‌ట్టిన నూత‌న సుల్తాన్ హ‌తిమ్ బిన్ తారిఖ్‌ ప్ర‌క‌టించారు.

కుబూస్ మృతికి మ‌స్క‌ట్ మూడు రోజుల సంతాప‌దినాల‌ను ప్ర‌క‌టించింది. 40 రోజుల‌పాటు జాతీయ జెండాను అవ‌న‌తం చేస్తామ‌ని పేర్కొంది.

సుల్తాన్ కుబూస్ మృతి ప‌ట్ల అమెరికా, బ్రిట‌న్, ఇరాన్‌, సౌదీ అరేబియా, క‌తార్‌, ట‌ర్కీ, జోర్దాన్ ఈజిప్టు దేశాలు సంతాపం తెలిపాయి. భార‌త ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోది సుల్తాన్ కుబూస్ కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఆయ‌న ఒక గొప్ప శాంతికాముకుడ‌ని అభివ‌ర్ణించారు. భార‌త్ కు సుల్తాన్ కుబూస్ మంచి మిత్రుడ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. గ‌ల్ఫ్ ప్రాంతంలోనే కాకుండా ప్ర‌పంచ శాంతికి దోహ‌ద‌ప‌డిన ఒక గొప్ప నాయ‌కుడ‌ని కోవింద్ అభివ‌ర్ణించారు. సుల్తాన్ కుబూస్ గౌర‌వార్థం జ‌న‌వ‌రి 13న ఒక రోజు సంతాప దినాన్ని భార‌త్ పాటించింది. భార‌త జాతీయ ప‌తాకాన్ని ఆ రోజు స‌గం అవ‌న‌తం చేశారు.

భార‌త ప్ర‌జ‌ల సంతాపాన్ని తెలియ‌బ‌రిచేందుకు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌క్వీ నేతృత్వంలోని ఒక భార‌త బృందం జ‌న‌వ‌రి 14న ఒమాన్ కు వెళుతోంది.

భార‌త్ – ఒమాన్ దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాలు ప‌టిష్ట ప‌రిచేందుకు దివంగ‌త సుల్తాన్ కుబూస్ ఎంత‌గానో కృషి చేశార‌ని ప్ర‌ధాన‌మంత్రి మోది త‌న సంతాప సందేశంలో తెలిపారు.

ఇరు దేశాల మ‌ధ్య వున్న స్నేహ సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకునేందుకు ` చేయి, చేయి క‌లిపి ముందుకు సాగుదామ‌ని ఒమాన్ నూత‌న సుల్తాన్ కు తెలిపిన అభినంద‌న సందేశంలో పేర్కొన్నారు.

భార‌త్ – ఒమాన్ దేశాలు ప్రాచీన కాలం నుంచి వ్యాపార‌, వాణిజ్య సంబంధాల‌ను క‌లిగి వున్నాయి. ఇరుదేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భందంతో పాటూ, స్నేహ సంబంధాలు ప‌టిష్టంగా వున్నాయి. భార‌త్ కు చెప్పుకోద‌గ్గ స్థాయిలో సొమ్మును పంపిస్తున్న సుమారు 80 వేల మంది ప్ర‌వాస భార‌తీయులు ఒమాన్ లో ఉన్నారు. ఒమాన్ అభివృద్ధి క్ర‌మంలో వారిది కీల‌క పాత్ర‌. 

నూత‌న సుల్తాన్ నేతృత్వంలోని ఒమాన్ తో స‌న్నిహిత సంబంధాల‌ను కొన‌సాగిస్తూ  ఇరు దేశాల మ‌ధ్య వున్న మిత్ర బంధాన్ని మ‌రింత ప‌టిష్ట‌ప‌రుచుకోవాల‌ని భార‌త్ ఆకాంక్షిస్తోంది.

ర‌చ‌న : డాక్ట‌ర్ ల‌క్ష్మి ప్రియ, IDSA రిస‌ర్చ్ అన‌లిస్టు