ఐరోపావైపు సరిహద్దులు తెరచిన టర్కీ – ముదిరిన సిరియా శరణార్థి సంక్షోభం

దేళ్ల కిందట 2015నాటి వలస సంక్షోభంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంపై ఐరోపా సమాఖ్య సభ్యదేశాల మధ్య తలెత్తిన అసమ్మతి ఇంకా మదినుంచి చెరిగిపోనే లేదు. ఈ నేపథ్యంలో టర్కీ చేపట్టిన ఇటీవలి చర్యలతో ఆనాటి పరిస్థితులు పునరావృతం కాగలవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకూ జరిగిందేమిటంటే- శరణార్థుల కోసం ఐరోపావైపు వెళ్లే తన సరిహద్దులను టర్కీ గతవారం పూర్తిగా తెరచింది. దీనిపై ఐరోపా సమాఖ్య సభ్యదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వలస సంక్షోభం సమాప్తి దిశగా సమాఖ్యతో కుదుర్చుకున్న 2015-2016నాటి శరణార్థి ఒప్పందాన్ని టర్కీ ఉల్లంఘించిందని అవి ఆరోపిస్తున్నాయి. అయితే, తమకు నిర్దేశించిన శరణార్థుల సంఖ్య పరిమితి దాటిందని, దాంతోపాటు సమాఖ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకోని కారణంగా ఐరోపావైపు తలుపులు మూసి ఉంచడం అసాధ్యమని టర్కీ వాదిస్తోంది. తమకు హామీ ఇచ్చిన ప్రకారం 600 కోట్ల యూరోల నిధులను విడుదల చేయలేదని, టర్కీతో వాణిజ్యాన్ని పెంచలేదని, సమాఖ్యలో టర్కీ సభ్యత్వంపై  సంప్రదింపులను వేగిరపరచలేదని, సమాఖ్య దేశాల్లోకి టర్కీ పౌరుల వీసారహిత ప్రయాణానికి అనుమతించలేదని ఆరోపణలు గుప్పిస్తోంది. కానీ, టర్కీ ఆరోపణల్లో వాస్తవం లేదని ఐరోపా సమాఖ్య తోసిపుచ్చింది. అలాగే తమ వాగ్దానం మేరకు… ఐరోపా కమిషన్‌ మొత్తం నిధులను విడుదల చేసిందని తెలిపింది. కాకపోతే ఈ నిధులను టర్కీ ప్రభుత్వానికి కాకుండా శరణార్థి సహాయ సంస్థలకు అందజేసినట్లు వివరించింది.

   రోపా సమాఖ్యలో తనకు సభ్యత్వంమీద సంప్రదింపులు చేపట్టకపోవడంపై టర్కీ ఆరోపణలను సమాఖ్య తోసిపుచ్చింది. టర్కీలో 2016నాటి తిరుగుబాటుపై అధ్యక్షుడు రిజిప్పు తయ్యిప్పు ఎడుడాన్‌ తీసుకున్న చర్యల దృష్టికోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఆనాడు విమర్శకులు, పాత్రికేయులపై టర్కీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని, వారిపై ఉక్కుపాదం మోపిందని నిరసించింది. అప్పట్లో అనేకమంది జర్మనీ పౌరులు టర్కీ జైళ్లలో నిర్బంధితులయ్యారని ఎత్తిచూపింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య మందగమనమే ఐరోపా-టర్కీల మధ్య వాణిజ్యం పెరగకపోవడానికి కారణమని వివరించింది. అదేవిధంగా ఐరోపాలో వలస వ్యతిరేక పక్షాలుసహా మితవాద సంప్రదాయవాద రాజకీయాల ఉధృతి, టర్కీలోని బలమైన మౌలిక అనుకూల వాదం తలెత్తడంతోపాటు ప్రపంచీకరణ నుంచి ఐరోపా వేరుపడే పరిస్థితులవల్ల సంప్రదింపులకు తగిన వాతావరణం ఏర్పడలేదని పేర్కొంది. అంతేగాక నాటో కూటమిలోగల ఐరోపాలో టర్కీసహా ఇతర దేశాల విషయమై- విదేశీయతా భయం, మతపరమైన అసహనం పెరిగాయి. ఇక 2015నాటి వలస సంక్షోభం నుంచి ఐరోపా ఇంకా కోలుకుంటూనే ఉంది. ఏదేమైనప్పటికీ టర్కీని అట్లాంటిక్ భద్రత వ్యవస్థ పరిధినుంచి దూరం పెట్టడానికి ఐరోపా సమాఖ్య, నాటో కూటమి సభ్య దేశాలు ఇష్టపడవు. ఎందుకంటే- వలస సంక్షోభ దృక్పథంలోనేగాక ఇతరత్రా పరిణామాల ప్రభావం కూడా ఐరోపా మీద భారీగానే ఉంటుందన్నది వాస్తవం.

   సిరియానుంచి వచ్చిన 36 లక్షలమంది శరణార్థులకు టర్కీ ఆశ్రయం ఇచ్చింది. ఈ స్థాయిలో శరణార్థులను ఆదుకున్న మరో అతిపెద్ద దేశం జోర్డాన్‌ మాత్రమే. అందుకే ఇంతకన్నా ఎక్కువగా శరణార్థుల భారాన్ని ఏమాత్రం మోయడం సాధ్యం కాదని టర్కీ స్పష్టం చేస్తోంది. మరోవైపు దేశీయంగానూ టర్కీ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థల తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణంతోపాటు శరణార్థులకు వ్యతిరేకంగా హింస, నిరుద్యోగం హెచ్చుస్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సిరియా శరణార్థుల సంఖ్య మరింత పెరిగితే దేశీయంగా మరిన్ని చిక్కులు వచ్చిపడతాయి. సిరియాలోని ఇద్లిబ్‌లో ప్రస్తుత అంతర్యుద్ధం నేపథ్యంలో అనేకమంది శరణార్థులు టర్కీలో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వచ్చేవారిని 2019 పునరావాస ప్రణాళిక కింద టర్కీ ప్రభుత్వం బలవంతంగా వెనక్కు పంపుతోంది. మరింత మంది శరణార్థులను అనుమతించడమంటే దేశంలో అశాంతి, అస్థిరతలను ఆహ్వానించడమేనన్నది వాస్తవం.

   సిరియా ప్రభుత్వం, అక్కడి కుర్దులపై విజయం సాధించే దిశగా ఐరోపా తమకు భద్రత కల్పించడంద్వారా సాయపడాలని టర్కీ కోరుతోంది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌కు విధేయంగా ఉన్న ప్రభుత్వ బలగాలు ఇద్లిబ్‌లోగల టర్కీ బలగాలను తీవ్రంగా దెబ్బతీస్తుండటమే ఇందుకు కారణం. సిరియా యుద్ధంలో కీలకపాత్ర పోషించాలని టర్కీ అధ్యక్షుడు ఎడుడాన్‌ ఆకాంక్షిస్తున్నా సదరు అవకాశం ఆయనకు లభించడంలేదు. అలాగే అరబ్‌ ప్రపంచంతోపాటు అంతర్జాతీయ సమాజం దృష్టిలోనూ టర్కీ భద్రత, ప్రశస్తి చాలా బలహీనంగా ఉన్నాయి. టర్కీ అధ్యక్షుడికి స్వదేశంలో ప్రజాదరణతోపాటు అరబ్‌ ప్రపంచంలోనూ మన్నన క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ ఇద్లిబ్‌లో పరిస్థితిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టర్కీ అధ్యక్షుడు మాస్కోలో సమావేశమై చర్చించారు. ఇద్లిబ్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నందున సుమారు 10 లక్షల మందిదాకా సిరియా శరణార్థులు ఇతర దేశాలకు పోటెత్తుతున్నారు. దీంతో అటు టర్కీలోనేగాక ఇటు ఐరోపాలోనూ శరణార్థి సంక్షోభం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టే ఐరోపా నుంచి కొన్నిరకాల సాయం పొందడానికి టర్కీ ఒత్తిడి తెస్తోంది. తద్వారా స్వదేశంలో ఎడుడాన్‌కు పరిస్థితులు కాస్త కలిసివస్తాయి. ఏదేమైనా బాల్కన్‌ మార్గంగుండా 2015-16 తరహాలో శరణార్థుల వెల్లువను టర్కీ అడ్డుకోగలదని ఐరోపా సమాఖ్య విశ్వసిస్తోంది.

   వాయవ్య సిరియాలో టర్కీ ఏకపక్ష సైనిక చర్యకు దిగడాన్ని భారత్‌ ఖండించింది. టర్కీ చర్యలవల్ల ఆ ప్రాంతంలో సుస్థిరతకు మాత్రమేగాక ఉగ్రవాదంపై పోరుకూ భంగం కలుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో టర్కీ-ఐరోపా సమాఖ్యల మధ్య వైరుధ్యం ప్రభావం- ఇద్లిబ్‌ నుంచి వచ్చి తీవ్ర విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న 10 లక్షల మంది సిరియా శరణార్థుల మీద పడబోదని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

రచన: డాక్టర్‌ ఇంద్రాణి తాలుక్దార్‌, రష్యా-సిఐఎస్‌-టర్కీ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు