కెనెసెట్ ఎన్నిక‌లు: ఇజ్రాయెల్‌లో ప్ర‌తిష్టంభ‌న‌కు ల‌భించ‌ని ప‌రిష్కారం

 జ్రాయెల్‌ చట్టసభ ‘కెనెసెట్‌’కు ఈ నెల 2వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఏడాది వ్యవధిలో మూడోసారి జరిగిన ఈ ఎన్నికల్లోనైనా స్వర్గంనుంచి అమృతం కురుస్తుందన్న ఇజ్రాయెలీల ఆశ అడియాసగానే మిగిలింది. సుదీర్ఘంగా దేశాన్నేలిన ప్రధానమంత్రి, లికుడ్‌ పార్టీ నేత బెంజమిన్‌ నెతన్యాహు పోలింగ్‌ ముగిసిన కాసేపటికే విజయం తమదేనని ధీమాగా ప్రకటించారు. కానీ, 120 మంది సభ్యులున్న చట్టసభలో ఆధిక్యానికి అవసరమైన 61 స్థానాలను సాధించడంలో ఆయన పార్టీ విఫలమైంది.

   ఎన్నికల్లో 60 లక్షల మందికిపైగా ప్రజలు ఓటువేయగా, లెక్కింపు దాదాపు 99 శాతం ముగిసేసరికి లికుడ్‌ పార్టీ 36 స్థానాలతో అతిపెద్ద పార్టీగా మాత్రమే అవతరించగలిగింది. మతవాద “షాస్‌, యునైటెడ్‌ టోరా జూడాయిజం” పార్టీలు 9, 7 వంతున స్థానాలు సాధించగా, మితవాద “యామినా” పార్టీకి 6 సీట్లు దక్కాయి. అయినప్పటికీ నెతన్యాహు నేతృత్వంలోని ఈ “మితవాద-మతవాద” కూటమి 58 స్థానాలతో సాధారణ ఆధిక్యానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయింది. మొత్తం ఓట్ల లెక్కింపు ముగిశాక స్థానాల సంఖ్య మారే అవకాశం ఉన్నప్పటికీ, నెతన్యాహు సాధారణ ఆధిక్యం అందుకోవడమూ సందేహాస్పదమే! అమెరికాతో సన్నిహిత బంధం, దేశ ఆర్థిక ప్రగతి తమకు ఘన విజయం కట్టబెడతాయన్న లికుడ్‌ పార్టీ ఆశలు నెరవేరలేదు. ప్రస్తుత లెక్కింపు ప్రకారం… ప్రతిపక్షాలన్నిటికీ కలిపి 62 స్థానాలు వచ్చినా అవి ప్రభుత్వాన్ని ఏర్పరచే అవకాశాలు లేవనే చెప్పాలి. కాగా- సకల సాయుధ దళాల మాజీ అధిపతి బెన్నీ గాంజ్‌ నేతృత్వంలోని మధ్యేవాద ‘బ్లూ అండ్‌ వైట్‌’ పార్టీ విజయంపై అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ 33 స్థానాలవద్ద ఆగిపోయింది. ఇక వామపక్ష ‘లేబర్‌-జెషర్‌-మెరెట్జ్‌’ కూటమికి 7 స్థానాలు రాగా- 1948 నుంచి నేటిదాకా ఎన్నడూలేని రీతిలో ఇజ్రాయెలీ ‘అరబ్‌ డెమోక్రటిక్‌ పార్టీ’కి 15 స్థానాలు లభించడం విశేషం.

   దేమైనా అవిగ్దోర్‌ లీబర్‌మాన్‌ నేతృత్వంలోని “ఇజ్రాయెల్‌ బెతేనూ” 7 స్థానాలతో మరోసారి నిర్ణయాత్మక పార్టీగా అవతరించింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే నెతన్యాహు, గాంజ్‌- ఇద్దరికీ లీబర్‌మాన్‌ మద్దతు తప్పనిసరి అయినా- అది అనుకున్నంత సులువేమీ కాదు! ఎందుకంటే… ఏ పార్టీ ప్రభుత్వంలోనైనా అరబ్‌ పార్టీలను భాగస్వాములను చేయడం ఆయనకు సుతరామూ గిట్టదు. అంతేగాక నెతన్యాహు, లీబర్‌మాన్‌ల మధ్య విభేదాలు ముదిరి 2018 డిసెంబరులో  ‘కెనెసెట్‌’ రద్దుకు దారితీశాయి. దాంతోపాటు 2019 ఏప్రిల్‌, సెప్టెంబర్‌సహా ఈ ఏడాది మార్చి 2న మూడోసారి సందిగ్ధ ఫలితాలతో కూడిన చట్టసభ ఎన్నికలకు కారణమయ్యాయి. ఇక ఇజ్రాయెల్‌ చరిత్రలో సుదీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపిన నెతన్యాహు- మిత్రపక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వచ్చేవారం ఆరంభంలో మొదలుకానుంది. ఎన్నికల ఫలితాలను దేశాధ్యక్షుడు రూవిన్‌ రివ్లిన్‌కు అధికారికంగా నివేదించాక తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన అన్ని పార్టీలతోనూ చర్చిస్తారు. ఎన్నికలు ముగిశాక సాధారణంగా 4 వారాల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆనవాయితీ కాగా- ప్రస్తుత అసందిగ్ధ ఫలితాల నేపథ్యంలో కాస్త భిన్నంగా ఈసారి కూడా అంతే సమయం పడుతుంది!

   నిరుడు రెండుసార్లు ఎన్నికలు జరిగినా లికుడ్‌ పార్టీకి లీబర్‌మాన్‌ మద్దతు నిరాకరించడమే ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈసారి కూడా ఆయన తన వైఖరి మార్చుకోని పక్షంలో ‘బ్లూ అండ్‌ వైట్‌’ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడంపై నెతన్యాహు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ దిశగా ఆయన ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించగా, ఫలితంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై నెతన్యాహు ఈ నెల 17న కోర్టుకు హాజరు కానున్నారు. అధికారంలో ఉండి నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కనున్న ఇజ్రాయెల్‌ తొలి ప్రధాని ఆయనే కావడం గమనార్హం. కాగా, పదవిలో ఉన్న ప్రధానిపై విచారణకు వీల్లేకుండా చట్టం తేవడానికి  కొన్ని నెలలుగా నెతన్యాహు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక పదవిలో ఉండి అభియోగాలున్నవారు ప్రధాని పదవికి అనర్హులంటూ బిల్లు తెచ్చేందుకు ‘బ్లూ అండ్‌ వైట్‌’ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఒక ఆకర్షణీయ మార్గంగా కనిపించినా లికుడ్‌ పార్టీ నాయకత్వం నుంచి నెతన్యాహును తొలగించాలని ‘బ్లూ అండ్‌ వైట్‌’ పార్టీ ఏనాటినుంచో పట్టుబడుతోంది. కానీ, ఇది నెతన్యాహుతోపాటు ఆయన పార్టీలో పలువురికి ఆమోదయోగ్యం కాదు. ఆయన స్థానంలో కొత్త నాయకుడి ఎంపిక అనూహ్య సవాళ్లకు, పార్టీ బలహీనపడటానికి దారితీస్తుందన్న భయమే ఇందుకు కారణం.

   ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రభావం ఆ దేశంతో భారత్‌ సంబంధాలపై ఏమాత్రం పడలేదు. అక్కడ కొత్త నాయకుడెవరైనా అధికారంలోకి వచ్చినప్పటికీ రెండు దేశాల స్నేహంలో ఎలాంటి మార్పూ ఉండదు. భారత-ఇజ్రాయెల్‌ ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. దీంతోపాటు రక్షణ, భద్రత, ఉగ్రవాద నిరోధంసహా అనేక అంశాలపై ఉభయపక్షాలూ సంయుక్తంగా కృషిచేస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్‌ రాజకీయం ఎన్ని మలుపులు తిరిగినా, భారత్‌తో బలమైన ద్వైపాక్షిక బంధానికిగల ప్రాథమిక స్వరూపం చెక్కుచెదరదని ఘంటాపథంగా చెప్పవచ్చు!

 

రచన: ప్రొఫెస‌ర్ పి.ఆర్‌.కుమార‌స్వామి, ప‌శ్చిమాసియా అధ్య‌య‌న కేంద్రం, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విశ్వ‌విద్యాల‌యం