పార్లమెంటులో ఈ వారం

ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన పార్లమెంటు రెండోదశ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 3వ తేదీవరకూ కొనసాగుతాయి. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, వ్యవసాయరంగ సమస్యలపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి-NDA ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తాయి; అయితే, వాస్తవాలు-గణాంకాలతో ఉభయసభల్లోనూ విపక్షాలను దీటుగా ఎదుర్కొనే కృతనిశ్చయంతో అధికారపక్షం కూడా సిద్ధమైంది. కార్మిక సంస్కరణలు, అద్దె గర్భం నియంత్రణసహా సుమారు 25 బిల్లుల జాబితాను సభామోదం కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవేగాక ద్రవ్య బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందనుంది. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాజ్యసభకు తెలిపారు.

ప్రస్తుత సమావేశాల్లోనే 2020-21కిగాను రైల్వే మంత్రిత్వశాఖ డిమాండ్లు-గ్రాంట్లకు సంబంధించి రైల్వేలపై స్థాయీ సంఘం నివేదికను రాధామోహన్‌ సింగ్‌, సునీల్‌ కుమార్‌ మండల్‌ సభకు సమర్పించనున్నారు. అలాగే విమాన సవరణ బిల్లు, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్‌ బిల్లు, ఖనిజలోహాల చట్ట సవరణ బిల్లు వంటివన్నీ సభా పరిశీలనకు వస్తాయి. ఇక వ్యక్తిగత సమాచార వినియోగంపై పర్యవేక్షణ కోసం సమాచార పరిరక్షణ ప్రాధికార సంస్థల ఏర్పాటును ప్రతిపాదిస్తున్న వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు-2019సహా మరికొన్ని సభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రత్యక్ష పన్నులపై వివాదాల పరిష్కార వ్యవస్థ ‘ది డైరెక్ట్‌ టాక్స్‌ ‘వివాద్‌ సే విశ్వాస్‌’ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. మరోవైపు సహకార బ్యాంకుల పటిష్ఠ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంకుకు మరిన్ని అధికారాలివ్వాలని ప్రతిపాదిస్తూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘బ్యాంకింగ్‌ నియంత్రణ (సవరణ) బిల్లు-2020”ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సహకార బ్యాంకుల్లో వృత్తిపరమైన సామర్థ్యం పెంపు, మూలధన లభ్యత, మెరుగైన పాలనతోపాటు రిజర్వు బ్యాంకుద్వారా పటిష్ఠ బ్యాంకింగ్‌ సేవలు అందించే ప్రధాన లక్ష్యంతో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, మార్చి 4వ తేదీన ఎలాంటి చర్చకు తావులేకుండానే ప్రత్యక్ష పన్నుల బిల్లుకు కేంద్ర ఆర్థిక మంత్రి సభామోదం సాధించారు. ప్రతిపాదిత పథకం కింద పరిష్కారం కోరే పన్ను చెల్లింపుదారులు సదరు వివాద మొత్తానికి అదనంగా 10 శాతం కలిపి ఈ నెల 31లోగా చెల్లిస్తే వడ్డీసహా జరిమానాను కూడా రద్దుచేసే వీలుంటుంది.

దేశంలో కార్మిక సంఘాల పాత్రను పునర్నిర్వచించే పారిశ్రామిక సంబంధాల స్మృతి బిల్లు కూడా పెండింగ్‌ జాబితాలో ఉంది. ఇక విమాన చట్టం-1934లో సవరణలను ప్రతిపాదిస్తున్న విమాన చట్ట సరవణ బిల్లు-2020ని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరీ సభకు సమర్పిస్తారు. ఖనిజాల చట్టం సవరణ బిల్లు-2020ని సభా వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సభలో ప్రవేశపెడతారు. దీనిద్వారా గనులు-ఖనిజాల అభివృద్ధి-నియంత్రణ చట్టం-1957కు సవరణలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీంతోపాటు బొగ్గుగనులపై ప్రత్యేక నిబంధనల చట్టం-2015ను కూడా సవరించాలని కోరుతోంది. ఖనిజాల చట్ట నిబంధనలను ప్రకటించడంద్వారా దాన్ని తక్షణం చట్టం చేయాల్సిన అవసరాన్ని తెలిపే వివరణాత్మక ప్రకటనను కూడా జోషి సభకు సమర్పిస్తారు. కాగా, వైద్యపరంగా గర్భస్రావం చట్ట సవరణ బిల్లు-2020ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ లోక్‌సభకు సమర్పించారు. గర్భం ధరించిన 20 వారాల తర్వాత వైద్యపరంగా గర్భస్రావానికి ఒక వైద్య నిపుణుడి సిఫారసు సరిపోతుందని, 20-24వారాల మధ్య అయితే, ఇద్దరు వైద్య నిపుణులు ఆమోదం తెలపాలని ఈ సవరణ బిల్లు ప్రతిపాదిస్తోంది.

కోవిడ్‌-19 పేరిట ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ గురువారం రాజ్యసభకు వివరించారు. కోవిడ్‌-19 పీడిత దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడంతోపాటు దేశమంతటా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక అటువంటి వారితో సంబంధాలున్నవారుసహా జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలున్నవారికి కూడా నిశిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనుమానిత కేసుల విషయంలో ఏకాంత చికిత్సకు వీలుగా దేశవ్యాప్తంగా తగినన్ని పడకలుసహా ఇతరత్రా తృతీయదశ వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన, ప్రాంతీయ, దేశీయ కార్యాలయాలతో ప్రభుత్వం నిరంతర సంబంధాలు నెరపుతూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రకటించారు. నిరంతర నిఘా, ప్రయోగశాలల్లో నిర్ధారణ, ఆసుపత్రుల సంసిద్ధత, రవాణా సదుపాయాల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సామర్థ్యం పెంపు, సమాజానికి ముప్పు సమాచార ప్రదానం తదితర ప్రధాన చర్యలపై దృష్టి కేంద్రీకరించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 సంబంధిత తాజా పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం మరింత ఉన్నతస్థాయిలో చర్యలు తీసుకుంటూ అవసరమైన మేరకు చర్యల పరిధిని విస్తరిస్తున్నదని వివరించారు.

 

రచన: యోగేష్‌ సూద్‌, పాత్రికేయులు