ఊపందుకున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల సన్నాహాలు

మరికొద్ది నెలల్లో … రానున్న 2020 నవంబర్’లో అమెరికా 46 వ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది.ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా రాజకీయాలలో కురువృద్ధ పార్టీ ..రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా మరోమారు పోటీచేసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’ సిద్ధమయ్యారు.చురుగ్గా అడుగులు వేస్తున్నారు.ఇంతవరకు వివిధ స్టేట్ ప్రైమరీస్ ,కాకసస్’లో 1099 ప్రతినిధులను ట్రంప్ గెలుచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ పొందేందుకు ట్రంప్’కు మొత్తం 1276 ప్రతినిధి ఓట్లు అవసరం. ఆ మార్క్ చేరితే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిలుస్తారు.

ఇక డెమొక్రటిక్ పార్టీ విషయానికి వస్తే, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, వెర్మాంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్న వారిలో ఈ ఇద్దరి మధ్యనే పోటీ నడుస్తోంది. అయితే, ‘Super Tuesday’ ప్రైమియర్స, కొన్ని కీలక రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించడంతో బిడెన్ ముందంజలో ఉన్నారు. మొత్తం 14 రాష్ట్రాలు సహా అమెరికన్ సమోవాలో మంగళవారం అధ్యక్ష అభ్యర్ధి ఎంపిక ఎన్నికకు presidential primaries జరిగాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసే మొత్తం జాతీయ ప్రతినిధులలో మూడింట ఒక వంతు మంది ,అంటే  1,344 మంది ఇక్కడి నుంచే ఎన్నికవుతారు. ఆ విధంగా మంగళవారం జరిగిన Super Tuesday ప్రిమియర్ నిర్ణాయక పాత్రను పోషిస్తుంది.ఈ ప్రిమరీస్’లో ఎవరు ఎక్కవ మంది ప్రతినిధులను గెలుచుకుంటే వారు, అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా నామినేట్ అవుతారు. 

అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు వరసగా స్టేట్ ప్రైమరీస్, కాకసస్’లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులను ఎంపిక చేసుకునే స్వేఛ్చ రాష్ట్రాలకు ఉంటుంది.ప్రతి ప్రైమరీ లేదా కాకసస్’లో నిర్దిష్ట సంఖ్యలో ప్రతినిధులు ఉంటారు. వీరు తమ తమ పార్టీల జాతీయ సమావేశాలలో తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మెజారిటీ పార్టీ ప్రతినిధుల మద్దతు పొందిన వారు అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు నామినేట్ అవుతారు. అంటే, జాతీయ స్థాయిలో జరిగే ప్రతినిదుల సభలో పార్టీ వారిని పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేస్తుంది.  

ఇక అక్కడి నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచార ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్ధులు దేశ వ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారం సాగిస్తారు. ర్యాలీలలో పాల్గొంటారు. చర్చలు సాగిస్తారు. దేశ వ్యాప్తంగా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు, ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు.అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం. దేశ అధ్యక్ష,ఉపాధ్యక్షులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు. పోలింగ్ పూర్తయిన తర్వాత, పోలైన  ఓట్లను రాష్ట్రాల వారీగా లెక్కిస్తారు. వాషింగ్టన్ DC, 48 రాష్ట్రాలలో గెలిచిన అభ్యర్ధి రాష్ట్రంలోని ఓటర్ల అందరి మద్దతు పొందుతారు.ఈ పద్దతిని, Winners-takes-all,పద్దతి లేదా విధానంగా వ్యవహరిస్తారు. ఇందుకు మైనే, నేబ్రాస్కర్ మినహాయింపు. ఇక్కడ దామాషా విధానం అమలులో ఉంది. అమెరికా అధ్యక్షడు కావాలంటే, పోటీలో ఉన్న అభ్యర్ధికి కనీసం 270 ప్రతినిధి ఓట్లను పొందవలసి ఉంటుంది. అంటే, 270 అందని ప్రతినిధులను గెలుచుకున్న అధ్యక్షుడవుతారు. 

Super Tuesday’ తర్వాత సెనేటర్ బెర్నీ సాండర్స్ తప్ప మిగిలిన వారంతా పోటీ నుంచి తప్పుకోవడంతో, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి నామినేషన్ పోటీలో ముందు వరసలో  ఉన్నారు. మిస్సోరి, మిస్సిస్సిపి, ఇడాహో, వంటి కీలక రాష్ట్రాలను ఆయన గెలుచుకున్నారు. బిడెన్ 820 మంది ప్రతినిధుల మద్దతుపొందితే ఆయన సమీప ప్రత్యర్ధి బెర్నీ సాండర్స్’కు 670 ప్రతినిధుల మద్దతు మాత్రమే లభించింది. 

ఇక ఇతర ముఖ్యమైన ప్రైమరీల విషయానికి వస్తే, ఫ్లోరిడా, ఆరిజోనా, ఇల్లినోసిస్, ఓహియోలలో కూడా పోలింగ్ పూర్తయింది.అదే విధంగా బెర్నీ సాండర్స్’కు గట్టి పట్టున్న కాలిఫోర్నియా,నేవదాలలోనూ ఇప్పటికే పోలింగ్ జరిగింది.అధ్యక్ష అభ్యర్ధి ఎంపిక ఓటింగ్ జరగ వలసిన రాష్ట్రాలలో సాండర్స్ ప్రతినిధుల లోటును భర్తీ చేసుకునే అవకాశం కనిపించడం లేదు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో కూడా సాండర్స్ అనుకూల వాతావరణం కనిపించడం లేదు.మరో వంక జోయ్ బిడెన్’కు ఆఫ్రికన్ అమెరికా సమూహాలతో పాటుగా ఇతర సమూహాల నుంచి విస్తృత మద్దతు లభిస్తోందని కూడా పరిశీలకులు పేర్కొంటున్నారు. 

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్’ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే, డెమోక్రాట్ల తమ మద్దతును పూర్తిగా సుస్థిరపరచుకోవలసిన అవసరం ఉందని, బిడెన్ గుర్తించారు.అందుకే, ఇటీవల ఫిడేల్ఫియాలో చేసిన ప్రసంగంలో పార్టీలో   ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. ముందు ముందు సాండర్స్ సంపూర్ణ మద్దతు లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.అలాగే,సుదీర్ఘ కాలం ప్రేమరీలను కొనసాగించడం సరి కాదని, అలా చేస్తే నవంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ పునః విజయానికి దోహదం చేస్తుందని డెమొక్రాట్ పార్టీ భావిస్తోంది.అయితే ఏది ఏమైనా, నవంబర్’లో జరిగే ఎన్నికలు  డెమొక్రాట్స్ ప్రతినిధుల సభలో మెజారిటీ తిరిగి పొందుతారా.. లేక .. అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ విధానాలకు ప్రజలు మరోసారి జై కొడతారా అన్నది తెలుస్తుంది. 

అదలా ఉంటే ,అమెరికా అధ్యక్ష ఎన్నికలను , ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశం చాలా జాగ్రత్త గమనిస్తోంది. రెండు దేశాలలో ప్రజాస్వామ్య విధానాలు భిన్నమైనవి అయినప్పటికీ, ఉభయ దేశాలు ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చే గౌరవం, సమానత్వ సమభావనలు ఉభే దేశాలను ఒకటిగా కలుపుతున్నాయి. 

రచన: డాక్టర్ స్తుతి బెనర్జీ, అమెరికా వ్యవహారల వ్యూహాత్మక విశ్లేషకులు